ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

తెలంగాణ రాష్ట్రంలో మరో ఆర్టీసీ కార్మికుడు కన్నుమూశాడు. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ జైపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. సమ్మె పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం, ఒత్తిడికి గురయ్యే వాడని తోటి కార్మికులు వెల్లడిస్తున్నారు. దేవరకొండ డిపో ఎదుట మృతదేహంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. జైపాల్ రెడ్డికి నివాళులర్పించేందుకు వచ్చిన డిపో ఆర్ఎంను కార్మికులు అడ్డుకుని నిలదీశారు.
విధుల్లోకి వెళ్లకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకుంటున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరకొండ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జైపాల్ రెడ్డిది..నాంపల్లి మండలం పగడిపల్లి గ్రామం. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆందోళనలో జైపాల్ కీలకంగా పాల్గొంటున్నాడు. ఇతను ఆరు నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. నవంబర్ 03వ తేదీ ఆదివారం తోటి కార్మికులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబసభ్యులు తోటి ఆర్టీసీ కార్మికులకు సమాచారం అందించారు. అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కానీ..మార్గమధ్యంలోనే జైపాల్ తుదిశ్వాస విడిచాడు. ప్రభుత్వం, ఆర్టీసీ యజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జైపాల్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పగడిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
Read More : ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : MMTS రైళ్లకు ఫుల్ డిమాండ్