ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా రూ.40 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం

కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Fake Currency Notes Gang Busted : ఏలూరు జిల్లా పోలీసులు దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లక్షల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 10లక్షల విలువైన నకిలీ నోట్లు ఇచ్చి 3 లక్షల ఇస్తే చాలు అంటూ సాధారణ ప్రజలను దొంగ నోట్ల ముఠా ఆశ పెడుతోంది. కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

దొంగ నోట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏలూరు జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు 49 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం దుమారం రేపింది. ఒక ముఠా ఉద్దేశపూర్వకంగానే కొన్ని రోజులుగా ఏలూరు జిల్లాలో అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ప్రతాప్ కిశోర్ నకిలీ నోట్ల ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టారు. 108 లో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న ఫణికుమార్ అనే వ్యక్తికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. 10 లక్షల రూపాయల విలువైన ఒరిజినల్ నోట్లు ఇస్తే నీకు రూ.40లక్షల విలువైన నకిలీ నోట్ల ఇస్తానని అతడితో చెప్పాడు. అయితే తన దగ్గర అంత మొత్తం లేదని, రూ.3లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. ఆ మొత్తంతో అతడు ఒప్పందం కుదుర్చుకుని నకిలీ నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే, అంబులెన్స్ డ్రైవర్ కు అనుమానం వచ్చి అతడు తన స్నేహితుల దగ్గర ప్రస్తావించాడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యేక నిఘా పెట్టారు. దొంగ నోట్లు చెలామణి చేసే వ్యక్తుల ఫోన్ కోసం వెయిట్ చేశారు. రాంబాబు, మధుసూదన్ రావు అనే ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్ డ్రైవర్ ఫణికుమార్ కు ఫోన్ చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలో తాము ఉన్నామని, నోట్లు మార్పిడి చేసుకుందామని సమాచారం ఇచ్చారు. వెంటనే ఫణికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

త్రీ టౌన్ పోలీసులు నిఘా పెట్టి ఆ వ్యక్తులు రాగానే అదుపులోకి తీసుకున్నారు. దొంగ నోట్ల చెలామణిలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మధుసూదన్ రావు, రాంబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు పెద్ద ఎత్తున దొంగ నోట్ల మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దొంగ నోట్ల ముఠా అరెస్ట్ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరికీ డబ్బులు ఊరికే రావని, అత్యాశకు పోతే అడ్డంగా మోసపోవడం ఖాయమన్నారు. దొంగ నోట్ల ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎప్పటి నుంచి దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారు? దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Also Read : వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

ట్రెండింగ్ వార్తలు