సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 5వ అదనపు సెషన్స్ ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది.
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ లో సమత హత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమతను గ్యాంగ్ రేపి చేసి గొంతుకోసి చంపేశారు. ఈ పని చేసింది తామే అని నిందితులు షేక్ బాబు, షాబోద్దీన్, మఖ్దూమ్ ఒప్పుకున్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దిశ ఘటన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించింది అన్నారు. సమత కేసులో కూడా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలకు అధిక ప్రాధన్యతనిస్తుందని స్పష్టం చేశారు. దోషులకు వెంటనే శిక్షలు పడేలా, భాదితులకు సత్వర న్యాయ జరిగేలా ప్రభుత్వం తమ వంతుగా కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం కేంద్రం కఠిన చట్టాలు తేవాలని మంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘దిశ’ ఘటన కంటే కొద్దిరోజుల ముందు ‘సమత’ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమత అత్యాచారం చేసి చంపేసిన ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాబొద్దీన్ గతంలోనూ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఏ2 షేక్‌బాబును భార్య వదిలేయడంతో గ్రామంలో జులాయిగా తిరిగేవాడని, , ఏ3 షేక్ ముక్దుం చోరీ కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చాడని తెలుస్తోంది. వీరు ముగ్గురూ ముఠాగా ఏర్పడి అడవిలో కలప నరికి స్మగ్లింగ్ చేసేవారని స్థానికులు చెబుతున్నారు. షాబొద్దీన్ గతంలో కోలాంగూడలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేయగా స్థానికులు దేహశుద్ధి చేసి గ్రామం నుంచి తరిమేశారని పోలీసుల విచారణలో తెలిసింది.