ఎన్నికల సంస్కర్త…మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కన్నుమూత

మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్,ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్(86) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(నవంబర్-10,2019)రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. తన పదవి కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలను గడగడలాడించారు.
టీఎన్ శేషన్ పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. ఆయన 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన సీఈసీగా సేవలు అందించారు. 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ తమిళనాడు కేడర్‌లో పనిచేశారు. అనంతరం 1989లో కేంద్ర కేబినెట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఆయన అందించిన సేవలకు గాను 1996లో భారత ప్రభుత్వం ఆయనను రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించింది.
దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలు చేయడం ద్వారా శేషన్ విశేష గుర్తింపు సాధించారు. ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయన ఒక రకంగా రాజకీయ పార్టీలతో యుద్ధమే చేశారని చెప్పవచ్చు. కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే.. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా ఆయన కఠిన చర్యలు తీసుకున్న తీరు అనితరసాధ్యం. గవర్నర్ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా మధ్యప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో ఏకంగా ఎన్నికలనే రద్దు చేసిన టీఎన్ శేషన్.. రాజకీయ పార్టీలకు తాను చెప్పదలచుకున్నదేమిటో స్పష్టం చేశారు. ఈ సంచలన నిర్ణయం కారణంగా సదరు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో శేషన్ ఎంత నిక్కచ్చిగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ మంత్రి శేషన్‌ను గుర్తు చేసుకొని ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో వేదిక దిగి కిందకి పరుగెత్తడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది
టీఎన్ శేషన్ మృతిపై ప్రధాని,పలు రాష్ట్రాల సీఎంలు,కేంద్రమంత్రులు,మాజీ మంత్రులు,పలువుర సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ టిఎన్ శేషన్ అత్యుత్తమ పౌర సేవకుడు. అతను చాలా శ్రద్ధతో, చిత్తశుద్ధితో భారతదేశానికి సేవ చేశాడు. ఎన్నికల సంస్కరణల పట్ల ఆయన చేసిన ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా మరియు మరింత పాల్గొనేలా చేశాయి. అతని మరణంతో బాధపడ్డానని,ఆయన ఆత్మకు శాంతిచేరూరాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.