Thief Arrest: చోరీ చేసిన సొమ్ముతో లగ్జరీ లైఫ్.. మూడంతస్తుల ఇల్లు, జిమ్, బాత్ టబ్ ఇంకా.. ఘరానా దొంగ అరెస్ట్..
చెత్తను సేకరించే వాడిలా నటిస్తూ.. ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసేవాడు.

Thief Arrest: వెస్ట్ బెంగాల్ లోని హౌరా పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి. అతడు అలాంటి ఇలాంటి దొంగ కాదు.. మహా మోసగాడని తెలుసుకుని పోలీసులు విస్తుపోతున్నారు. 13 ఏళ్ల పాటు అతడు డబుల్ లైఫ్ ని లీడ్ చేశాడు. ఉదయం పూట ఒక రకంగా, రాత్రి పూట మరో రకంగా ఉండే వాడు. ఉదయం పూట చాలా మంచి వాడిలా ఉండేవాడు. రాత్రి కాగానే దొంగతనాలు చేసేవాడు. ఇలా.. ఏకంగా 13ఏళ్లు గడిచిపోయాయి. చోరీ చేసిన డబ్బు, నగలతో ఆ దొంగ ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అతడికి మూడంతస్తుల ఇల్లు ఉంది. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో జిమ్, బాత్ టబ్ ఉన్నాయి.
అతడి పేరు అమిత్ దత్తా. వయసు 46ఏళ్లు. ఘరానా దొంగ. 13ఏళ్లుగా చోరీలు చేస్తున్నాడు. కానీ, ఎన్నడూ పోలీసులకు చిక్కలేదు. జూన్ 5న అతడి పాపం పండింది. దొంగతనం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. రాజాపూర్ ప్రాంతంలో ఓ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నిస్తున్న సమయంలో పోలీసులు అమిత్ ను పట్టుకున్నారు.
దొంగ విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ దొంగకు మూడు అంతస్తుల ఇల్లు ఉంది. అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి. ట్రెడ్ మిల్, బాత్ టబ్ టాయ్ లెట్, మార్బల్ ఫ్లోర్, శాండిలీర్స్, జిమ్.. ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. అతడు ఇన్ కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాడట. అంతేకాదు ఇటీవలే ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియా టూర్ కీ వెళ్లొచ్చాడు.
అమిత్ దత్తా తాను దొంగని అని తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. అతడు చోరీలు చేస్తాడని ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నాడు. మంచోడు అనే ముద్ర వేయించుకున్నాడు. తన స్నేహితులకు, ఇంటి చుట్టుపక్కల నివాసం ఉండే వారికి సాయం చేసేవాడు. పెద్ద మొత్తంలో డబ్బు సాయం కూడా చేసే వాడు. అలా అతడు అందరి దగ్గర చాలా మంచోడు అనే పేరు సంపాదించాడు. తాను చేసే దొంగతనాల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.
ప్రతి ఉదయం అతను బడ్జ్ బడ్జ్ నుండి భాగీరథి నదిని దాటి ఉలుబేరియా, రాజపూర్, బౌరియా, పంచల ప్రాంతాలకు వెళ్ళే వాడు. చిరిగిన బట్టలు, లుంగీని ధరించే వాడు. చెత్తను సేకరించే వాడిగా నటిస్తూ ఉండేవాడు. వీధి వీధి తిరుగుతూ ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసేవాడు. తాళాలు వేసిన ఇళ్లను నోట్ చేసుకునే వాడు. ఇక, ఇంటికి వేసిన తాళాలు తీయడంలో అతని నైపుణ్యం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఎక్కువగా నగలు, ఆభరణాలు దొంగిలించడంపైనే అమిత్ దృష్టి పెట్టేవాడు. అలా.. తక్కువ సమయంలోనే అతడు ఎక్కువ మొత్తం సంపాదించగలిగాడని పోలీసులు తెలిపారు.
కొన్నాళ్లుగా ఆ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ పని చేస్తున్నది ఎవరో తెలుసుకోలేకపోయారు పోలీసులు. ఈ చోరీ కేసులను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఉలుబేరియా వ్యాపారవేత్త భక్తిపాద మండల్ ఇంట్లో జరిగిన లక్షల విలువైన నగదు, ఆభరణాల దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న హౌరా గ్రామీణ పోలీసులకు.. రాజాపూర్‌లోని హల్దార్‌పారాలోని మరో వ్యాపారవేత్త ఇంట్లో దొంగ మరోసారి చొరబడటానికి ప్రయత్నిస్తాడని సమాచారం అందింది.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ దుస్తుల్లో డ్యూటీకి ఎక్కారు. ఉచ్చు బిగించారు. అమిత్ దత్తా దొంగతనానికి ప్రయత్నించే వరకు వేచి ఉన్నారు. సరిగ్గా ఇంటి తాళం పగలగొట్టే సమయానికి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గత దశాబ్ద కాలంగా ఉలుబేరియా, నిమ్దిఘి, రాజాపూర్ పోలీస్ స్టేషన్లలో పరిష్కారం కాని పాత దొంగతనం కేసు ఫైళ్లను తిరగేశారు పోలీసులు. ఈ క్రమంలో అమిత్ దత్తా గురించి తెలిసింది. చివరికి దొంగ దొరికాడు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమిత్ దత్తాకు మూడు అంతస్తుల భవనం ఉందని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. చోరీ చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని తెలిసి విస్తుపోయారు.
ఆ ఇంట్లో దత్తా తన భార్య, కొడుకు, కోడలితో నివసిస్తున్నాడు. ఆ ఇంట్లో శాండ్ లియర్లు, బాత్ టబ్, జిమ్ పరికరాలు, ఎయిర్ కండిషనర్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వంటి విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. దత్తా దొంగిలించిన డబ్బుతో ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియాకు కూడా వెళ్లొచ్చడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. తన అక్రమ సంపాదనపై క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను కూడా చెల్లించాడు. అరెస్ట్ కావడానికి వారం ముందు అతను సెడాన్ కారును బుక్ చేసుకున్నాడు.
దత్తా చాలా తెలివైనవాడు. తన పొరుగు వారిని, పోలీసులను తప్పుదారి పట్టించాడు. తొలుత తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చాడు. పోలీసులు నాలుగు తగిలించాక అసల నిజం కక్కేశాడు. ఈ కేసు స్థానికులను షాక్ కి గురి చేసింది. అమిత్ దత్తా పెద్ద దొంగ అని తెలిసి అంతా విస్తుపోతున్నారు. దత్తా అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. అందరికీ ఆర్థిక సాయం కూడా చేసేవాడు. స్థానిక క్లబ్‌కు భారీ మొత్తాలను విరాళంగా ఇచ్చేవాడు. అలా తనపై ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నాడు. అలా 13ఏళ్లు గడిచిపోయాయి. చివరికి పాపం పండింది. అమిత్ దత్తా అడ్డంగా దొరికిపోయాడు.