CM Revanth Reddy : బూట్లతో కొట్టి చిత్ర హింసలు పెట్టారు, 50లక్షలు తీసుకున్నారు- ఏసీపీపై సీఎం రేవంత్ రెడ్డికి వ్యాపారి ఫిర్యాదు

పోలీసులను పంపి బెదిరించి పిటిషన్ ను ఉపసంహరించుకునేలా ఏసీపీ ఉమా మహేశ్వరరావు చేశారని శరణ్ చౌదరి ఆరోపణలు గుప్పించారు.

CM Revanth Reddy : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు హైదరాబాద్ కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి. దీనిపై ఏకంగా సీఎం రేవంత్ కి లేఖ రాశారు శరణ్ చౌదరి. గత ప్రభుత్వం హయాంలో తనను అక్రమంగా నిర్బంధించి తన ఇంటిని ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేరున రిజిస్ట్రేషన్ చేయించారని, అలాగే రూ.50లక్షల నగదును తీసుకున్నారని ఆరోపించారు. గత ఏడాది ఆగస్టు 23న తాను ఆఫీసుకి వెళ్తుండగా.. సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు తనను సీసీఎస్ కు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ ఏసీపీ ఉమా మహేశ్వరరావు తనను బెదిరించారని తెలిపారు.

తాను పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లు కేసు పెడతామని బెదిరించారన్నారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి కొట్టారని.. సీఎం రేవంత్ కు రాసిన లేఖలో శరణ్ చౌదరి తెలిపారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా.. పోలీసులను తన వద్దకు పంపి బెదిరించి పిటిషన్ ను ఉపసంహరించుకునేలా ఏసీపీ ఉమా మహేశ్వరరావు చేశారని శరణ్ చౌదరి ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా చేయాలని సీఎం రేవంత్ ను కోరారు శరణ్ చౌదరి. దుబాయ్ నుండి ఈ ఫిర్యాదు చేశారు శరన్ చౌదరి.

”టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావు, సిసిఎస్ ఏసిపి ఉమామహేశ్వరరావు వేధింపులకు గురి చేశారు. 2023 ఆగస్టు 21న ఆఫీస్ కి వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో సివిల్ డ్రెస్సులు వచ్చిన కొంతమంది పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు. సివిల్ డ్రెస్ లో వచ్చి ప్రైవేట్ కారులో నన్ను సిసిఎస్ కు తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారు. చాలామంది నుండి డిపాజిట్లు తీసుకున్నానని నాపై కేసు నమోదు చేశారు. నా ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం సృష్టించి విజయ్ అనే వ్యక్తికి నా ఫ్లాట్ ను రాయించారు. విజయ్ అనే వ్యక్తి మాజీ మంత్రి దయాకర్ రావుకు దగ్గరి బంధువు. మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావు ఆదేశాలతో సిసిఎస్ లో నన్ను చిత్రహింసలకు గురి చేశారు. బూటు కాలుతో తన్నారు. చెప్పుతో కొట్టారు. బలవంతంగా రెండు రోజులపాటు కస్టడీలో పెట్టుకొని అక్రమంగా బంధించారు.

టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక విజయ్ కి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించడానికి అంగీకరించాను. నేను పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో డబ్బులు ఇవ్వాలని నా కుటుంబంపై తీవ్ర ఒత్తిడి చేశారు. నా స్నేహితుడి నుండి 50 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. న్యాయం కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే మా ఇంటి పైకి పోలీసులు పంపి బెదిరింపులకు దిగారు. నా రిట్ పిటిషన్ ఉపసంహరించుకొనే వరకు ఉమామహేశ్వరరావు, రాధా కిషన్ రావు ఒత్తిడి చేశారు. నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా” అని సీఎం రేవంత్ కు లేఖ రాశారు శరణ్ చౌదరి.

Also Read : తెలంగాణ బీజేపీలోకి వరదలా వలసలు.. అక్కడే సమస్య.. కొత్త టెన్షన్

ట్రెండింగ్ వార్తలు