తెలంగాణ బీజేపీలోకి వరదలా వలసలు.. అక్కడే సమస్య.. కొత్త టెన్షన్

BJP: ఈ సమస్యను అభ్యర్థులు హైక‌మాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అల‌ర్ట్ అయిన అధిష్టానం దూతల్ని రంగంలోకి దింపింది.

తెలంగాణ బీజేపీలోకి వరదలా వలసలు.. అక్కడే సమస్య.. కొత్త టెన్షన్

Kishan Reddy

తెలంగాణ బీజేపీకి వలసలు వరదలా వస్తున్నాయి. ఇతర పార్టీల నేతలు కమలం కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. కానీ ఈ వలసలే బీజేపీకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయి. ఇంతకీ వలస నేతలతో బీజేపీకి వచ్చిన సమస్యేంటి..? ఇప్పటికే ఉన్న నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు. ఒరిజినల్ నేతలకు వలసలతో వచ్చిన తంటాలేంటి? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.

కొత్త నీరు వస్తే.. పాత నీరుకు వెళ్లిపోవాల్సిందే.. ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే సూత్రం నడుస్తోంది. వలస నేతలొచ్చి పాత నేతల సీట్లకు ఎసరుపెడుతున్నారు. టికెట్ల పంపకాల్లో కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తోంది. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లు కట్టబెడుతోంది. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్ననేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

తెలంగాణలోని 17ఎంపీ స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థుల్ని కన్ఫామ్ చేసింది. కరీంనగర్‌, సికింద్రాబాద్‌కు బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డితో పాటు చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్లను ప్రకటించారు. అలాగే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-డీకే అరుణ‌, నిజామాబాద్‌-అర్వింద్, మ‌ల్కాజ్‌గిరి-ఈటల రాజేందర్, మెద‌క్‌-రఘునందన్ రావు , భువ‌నగిరి టికెట్‌ను బూర న‌ర్సయ్య గౌడ్‌కు కేటాయించింది.

ఈ మ‌ధ్యనే పార్టీలో చేరిన మాధవీలతకు హైద‌రాబాద్ టికెట్, జహీరాబాద్ స్థానాన్ని బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ స్థానాన్ని ఎంపీ రాములు కుమారుడు భ‌ర‌త్‌కు కట్టబెట్టారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి వ‌చ్చిన సైదిరెడ్డికి నల్గొండ టికెట్ ఇచ్చారు. మహబూబాబాద్‌ టికెట్‌ సీతారాంనాయక్‌కు ఇచ్చేశారు.

ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీని కాద‌ని న‌గేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్‌కు పెద్దపెల్లి టికెట్ కేటాయించారు. ఇక మిగిలిన వ‌రంగల్, ఖ‌మ్మం ఎంపీ స్థానాలను కూడా బీఆర్ఎస్‌ నుంచి వలసొచ్చిన నేతలకే కట్టబెట్టేందుకు కమలం పార్టీ ఆలోచన చేస్తోంది.

పాత లీడర్లు గుర్రుగా..

ఇప్పుడిదే వ్యవహారంపై బీజేపీ పాత లీడర్లు గుర్రుగా ఉన్నారు. కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ మిన‌హాయిస్తే మిగతా నేతలంతా కాంగ్రెస్, గులాబీ పార్టీ నుంచి వ‌చ్చిన‌వారే. వీరిలో కొంద‌రు 2019లో వ‌స్తే.. మిగిలిన వారంతా ఈమ‌ధ్యనే కాషాయం కండువా కప్పుకున్నారు.

లోక్‌సభ ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో వలసనేతలకు పెద్దపీట వేయడంతో పార్టీ సీనియర్లు కోపంగా ఉన్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థులకు స‌హ‌క‌రించ‌డం లేదని తెలుస్తోంది. గెలుపుపై గంపెడు ఆశ‌లు పెట్టుకొని వలసొచ్చిన నేతలకు ఓల్డ్ లీడర్లు షాక్ ఇస్తున్నారు.

ఈ సమస్యను అభ్యర్థులు హైక‌మాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అల‌ర్ట్ అయిన అధిష్టానం దూతల్ని రంగంలోకి దింపింది. నేతలతో సునీల్ బ‌న్సల్, చంద్రశేఖ‌ర్ తివారి సమావేశమై అభ్యర్థులకు సహకరించాలంటూ హితోపదేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి పార్టీలోకి రాగానే బీజేపీ టికెట్‌ సాధించుకున్న నేతలకు ఏ మాత్రం సంబురం లేకుండా పోయింది. మరి హైకమాండ్ చొరవతో పాత నేతలు సర్దుకుపోతారా.. సైలెంట్‌గా సైడ్‌ అయిపోతారా అనేది ఇప్పుడు కమలం పార్టీలో ఉత్కంఠగా మారింది.

సాధారణ సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ పీఠాన్ని శాసించేస్థాయికి కేజ్రీవాల్.. ఇప్పుడేమో..