సాధారణ సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ పీఠాన్ని శాసించేస్థాయికి కేజ్రీవాల్.. ఇప్పుడేమో..

చాలా సాదాసీదాగా పార్టీని పెట్టిన కేజ్రీవాల్ అనతికాలంలోనే ఉవ్వెత్తున ఎదిగారు.

సాధారణ సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ పీఠాన్ని శాసించేస్థాయికి కేజ్రీవాల్.. ఇప్పుడేమో..

Arvind Kejriwal

అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఈ పేరు.. సరిగ్గా 12ఏళ్ల క్రితం దేశ రాజకీయాల్లో పెను సంచలనం. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన కేజ్రీవాల్.. సాధారణ సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ పీఠాన్ని శాసించేస్థాయికి ఎదిగారు. వరుసగా మూడు సార్లు ఢిల్లీ గద్దెనెక్కి.. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుసుకున్నారు.

సామాజిక ఉద్యమ కారుడిగా ప్రజాజీవితంలోకి వచ్చిన కేజ్రీవాల్.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చారు. వరుసగా మూడుసార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన కేజ్రీవాల్ 1992లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌ IRS అధికారి అయ్యారు. 2002లో IRSకు వీడ్కోలు పలికి, సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు.

పరివర్తన్ పేరుతో ఓ సంస్థను పెట్టి.. ఢిల్లీ ప్రజల సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు కేజ్రీవాల్. ఆయన పోరాట ఫలితంగానే..యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది.

ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం
ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అదే సమయంలో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ఊపందుకొంది. కేజ్రీవాల్ దానిని ముందుండి నడిపించారు. 2011, 12లో అవినీతికి వ్యతిరేకంగా జన్‌ లోక్‌పాల్ డిమాండ్ చేస్తూ అన్నాహజారే చేసిన ఉద్యమానికి కేజ్రీవాల్ తన సహకారం అందించారు.

ఢిల్లీ గల్లీల్లో సమావేశాలు నిర్వహించి జనాలకు దగ్గరవుతూ వచ్చారు కేజ్రీవాల్. నిత్యం రోడ్లపైనే ఉద్యమిస్తూ అగ్రెసివ్ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యవస్థతో విసిగిపోయిన వేలాదిమంది యువత ఆయన వెంట నడిచారు.

లోక్‌పాల్‌ బిల్లు కోసం ఉద్యమిస్తున్న సమయంలో అన్నాహజారేతో విభేదించారు కేజ్రీవాల్. శాంతియుత మార్గం ద్వారా లోక్‌పాల్‌ ను సాధించలేమనేది కేజ్రీవాల్ వాదన. ప్రత్యక్ష రాజకీయాలు, ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు దిగివస్తాయనే అన్నాహజారేతో వాదిస్తూ వచ్చారు కేజ్రీవాల్. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు అన్నాహజారే వ్యతిరేకం.

ఈ సిద్ధాంతాల కారణంగా అన్నాహజారేతో డిఫర్ అయిన కేజ్రీవాల్.. ఆప్ పార్టీని స్థాపించారు. మొదటిసారి కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా లోక్‌పాల్‌ విషయాన్ని మర్చిపోలేదు కేజ్రీవాల్.

2012లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు కేజ్రీవాల్. చాలా సాదాసీదాగా పార్టీని పెట్టిన కేజ్రీవాల్ అనతికాలంలోనే ఉవ్వెత్తున ఎదిగారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు గెలుచుకున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌‌పై పోటీ చేసి, కేజ్రీవాల్ 25 వేలకు పైగా ఓట్లతో గెలిచారు.

ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, వీలైనంత త్వరగా జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు. కానీ, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

మళ్లీ వీధుల్లోకి..
ఢిల్లీ సీఎం పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు కేజ్రీవాల్. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గానూ ఆప్ ఏకంగా 67 చోట్ల గెలుపు జెండా ఎగురవేసింది.. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలన సంస్కరణల్లో ఎన్నో మార్పులు తెచ్చి ఢిల్లీ ప్రజలకు దగ్గరయ్యారు.

స్కూళ్లు, హాస్పిటళ్లు బాగు చేసి మెరుగైన విద్య, వైద్యం అందించి ప్రజలకు మరింత చేరవయ్యారు కేజ్రీవాల్. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ విజయం సాధించింది. ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్.

మూడోసారి ఢిల్లీ ఎన్నికలను ఫేస్ చేసిన తర్వాత.. దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ క్రేజ్ పెరిగిపోయింది. మోదీ వేవ్‌లోనూ ఢిల్లీలో పాగా వేసిన కేజ్రీవాల్..అంతటితో ఆగకుండా పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు. పంజాబ్‌లో ఆప్ సర్కార్‌ను అధికారంలోకి తీసుకొచ్చి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ లభించగా, యూపీ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. గతేడాది ఆప్‌కు జాతీయ పార్టీ హోదా వచ్చింది.

Powers Of Enforcement Directorate : ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అధికారాలు ఏంటి?