భార్యను చంపి.. తానూ కాల్చుకున్న భర్త: టెక్సాస్‌లో హైదరాబాద్ వాసుల మృతి

భార్యను చంపి.. తానూ కాల్చుకున్న భర్త: టెక్సాస్‌లో హైదరాబాద్ వాసుల మృతి

Updated On : February 19, 2019 / 2:31 PM IST

హైదరాబాద్‌కు చెందిన దంపతులు అమెరికాలోని టెక్సాస్‌లో అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక విచారణను బట్టి భార్యను కాల్చి తనను తాను కాల్చుకున్నట్లుగా కనిపిస్తోందని అక్కడి పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ నకిరేకంటి(51), శాంతి కొన్నేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. వారికి 16 సంవత్సరాల కూతురు, 21 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఇంట్లో ఉన్న కూతురు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

రిలయెంట్ ఎనర్జీ అనే సంస్థకు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు శ్రీనివాస్. అతని భార్య శాంతి యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంది. షుగర్ ల్యాండ్ ఏరియాలో ఉంటున్న వీరిద్దరి మధ్య గతంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం తెల్లవారుజాము 5:40నిమిషాలకు గన్ శబ్దాలు వినబడడంతో అక్కడికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. 

ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించిన ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్.. భార్య తలపై గన్‌తో కాల్చి తనను తాను బెడ్ రూమ్‌కు వెళ్లి షూట్ చేసుకున్నట్లు తెలిపారు. అతను చనిపోయే ముందు అతని స్నేహితునికి కొద్ది నిమిషాల ముందు ఈ మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ మెయిల్ కోణంలోనూ విచారణ మొదలుపెట్టారు. ఎంక్వైరీ పూర్తయ్యాక… మృతదేహాలను స్వదేశానికి (భారత్) పంపిస్తామన్నారు.