Fake Pregnant Job Scam Representative Image (Image Credit To Original Source)
Fake Pregnant Job Scam: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎదుటి వారి అమాయకత్వాన్ని, అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు. వీక్ నెస్ పై దెబ్బకొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటినే ఎన్నో స్కామ్ లు వెలుగుచూశాయి. తాజాగా మరో దిమ్మతిరిగిపోయే స్కామ్ ఒకటి బయటపడింది. మహిళలను గర్భవతిని చేస్తే చాలు.. 10 లక్షలు మీ సొంతం అని ఊరిస్తున్నారు. అరె.. ఈ ఆఫర్ ఏదో భలేగుందే.. అని మగాళ్లు టెంప్ట్ అయ్యారో.. ఇక అంతే సంగతులు. మీ జేబులు ఖాళీ అవడం ఖాయం.
బిహార్ సైబర్ పోలీసులు ఘరానా మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ అనే సైబర్ స్కామ్‌ని ఛేదించారు. ప్లేబాయ్ సర్వీస్, SBI చీప్ లోన్స్ అంటూ సోషల్ మీడియా పోస్టులతో ప్రజలను మోసగిస్తున్నారని గుర్తించారు. పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని యాడ్ ఇస్తారు. ఒకవేళ విఫలమైనా సగం డబ్బులిస్తామని నమ్మిస్తున్నారు.
అంతేకాదు.. నమ్మకం కుదిరేలా.. మోడల్స్ ఫొటోలు పంపి ఫ్రీ రొమాన్స్ ఆఫర్ చేస్తారు. దీన్ని చూసి ఎవరైనా టెంప్ట్ అయితే.. ఇక వారి జేబులు ఖాళీ అవడం ఖాయం. రిజిస్ట్రేషన్ పేరుతో, హోటల్ చార్జీల పేరుతో దోచుకుంటారు. ఈ స్కామ్ ని పోలీసులు చేదించారు. ఇలాంటి స్కామ్ లు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కక్కుర్తి పడ్డారో ఖేల్ ఖతమ్ అంటున్నారు.
బీహార్‌లోని నవాడా జిల్లాలో ఈ షాకింగ్ సైబర్ మోసం బయటపడింది. కొంతమంది సైబర్ క్రిమినల్స్ పిల్లలు లేని జంటల భావోద్వేగాలతో ఆడుకుంటూ ఒక నకిలీ పథకాన్ని ప్రారంభించారు. వారు ఈ పథకానికి ఆకర్షణీయమైన పేరు పెట్టారు. ప్రజలకు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే కలలను చూపించారు. ఈ మోసగాళ్ళు ఫోన్ ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నారు. ఒక ప్రత్యేక గర్భదారణ నుండి గణనీయమైన డబ్బు సంపాదించొచ్చని ఆశ పెడతారు. వారి మాటలు నమ్మి ఎరలో పడ్డాక రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బు గుంజుతున్నారు.
పిల్లలు లేని మహిళలను గర్భవతులు చేయండి, చీప్ లోన్స్, ఫేక్ జాబ్స్ హామీలతో బాధితులను మోసం చేస్తున్న ఒక ముఠాను బీహార్‌లోని నవాడా సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా, ఒక గ్రామంలో పని చేస్తున్న ఈ మోసపూరిత కేంద్రంపై దాడి చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్. పురుషులతో పాటు మహిళలను కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
నిందితుల నుండి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్న సమాచారం ఆధారంగా బాధితుల సంఖ్య, ముఠా పరిధిని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సైబర్ మోసంలోని కొత్త పద్ధతులను వెలుగులోకి తెచ్చింది. పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
”ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’… ఉద్యోగం, లోన్ పేరుతో చేస్తున్న బడా స్కామ్ ఇది. ‘ప్లేబాయ్ సర్వీస్’ వంటి అనేక తప్పుదారి పట్టించే ప్రకటనలు వాడారు. ‘ధని ఫైనాన్స్’, ‘SBI చీప్ లోన్స్’ వంటి పేర్లను ఉపయోగించి చీప్ లోన్స్ ఆఫర్ చేశారు. ఇటువంటి టెంప్ట్ చేసే పదాలతో ఫేక్ యాడ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. మహిళలను గర్భవతిని చేస్తే 10 లక్షలు ఇస్తామని ఆశ పెడతారు. అయితే, ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజులు, హోటల్ చార్జీలు మొదలైన వాటికి సంబంధించి ప్రాథమిక ఛార్జీలు ముందుగా చెల్లించాలని అడుగుతారు.
10 లక్షల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు సంపాదించడానికి ఇది సులభమైన మార్గం అని నమ్మి చాలామంది.. వారు అడిగినంత డబ్బు చెల్లిస్తున్నారు. సపోయామని గ్రహించేలోపు కష్టపడి సంపాదించిన డబ్బుని పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత లబోదిబోమంటున్నారు. అయితే, ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందనే భయంతో చాలామంది బాధితులు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా మౌనంగానే ఉండిపోతున్నారు” అని పోలీస్ అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రలోభపెట్టే, అసాధారణమైన హామీలను నమ్మొద్దని పోలీసులు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.