NCLATలో రవిప్రకాశ్‌, శివాజీకి చుక్కెదురు

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 09:58 AM IST
NCLATలో రవిప్రకాశ్‌, శివాజీకి చుక్కెదురు

Updated On : May 16, 2019 / 9:58 AM IST

TV9 షేర్ల వివాదంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీకి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌(NCLAT)లో చుక్కెదురు అయ్యింది. విచారణపై ఎన్‌సీఎల్ఏటీ స్టే ఇచ్చింది. జులై 12 వరకు ఎలాంటి ప్రొసీడింగ్ జరగడానికి వీళ్లేదని ఆదేశిస్తూ.. అదే రోజుకు తర్వాతి విచారణను వాయిదా వేసింది. TV9 సంస్థలో 40 వేల షేర్లను రవిప్రకాశ్‌ దగ్గర నుంచి.. రూ.20లక్షలు చెల్లించి కొనుగోలు చేశానంటూ శివాజీ పిటీషన్‌ వేశాడు. 2018 ఫిబ్రవరి 20న ఒప్పందం చేసుకున్నామని తెలిపాడు. ABCLలో జరిగిన మార్పులు తనకు తెలియకుండా రవిప్రకాశ్‌ మోసపూర్వకంగా వ్యవహరించారని పిటీషన్‌ సారాంశం. ఈ వివాదంపై అలంద మీడియా ఎన్‌సీఎల్ఏటీని ఆశ్రయించింది.

అసలు వ్యవహారం ఇలా ఉంటే.. TV9లోకి కొత్త యాజమాన్యం రాకుండా అడ్డుకోవడానికి నటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT)ని ఆశ్రయించారు. NCLATలో శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం..  ABCLలో రవిప్రకాశ్‌కు కొంచెం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ తెలిపారు. 

అయితే ABCLలో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తన దగ్గర దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ NCLAT దగ్గర దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో తెలిపారు. దానికి రవి ప్రకాశ్‌ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి NCLAT జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, NCLATలో ఉన్న ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. 

రవిప్రకాశ్, శివాజీ మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు.. శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగించింది. ఈ అనుమానాల వల్లే శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరినట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా TV9 కొత్త యాజమాన్యం భావించింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు అసలు గుట్టును.. ఈ-మెయిల్ సర్వర్ల నుంచి వెలికి తీశారు. దీంతో.. రవిప్రకాశ్‌, శివాజీతో కలిసి ఆడిన నాటకం బట్టబయలు అయ్యింది.