కిడ్నాప్‌ డ్రామా : యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ప్రియుడు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 03:40 PM IST
కిడ్నాప్‌ డ్రామా : యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ప్రియుడు

Updated On : April 30, 2019 / 3:40 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో విస్సాకోడేరులో కిడ్నాప్‌ డ్రామా కలకలం రేపింది. విస్సాకోడేరులో ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రియురాలి స్కెచ్‌ వేసింది. తల్లితో కలిసి బయటకు వచ్చిన యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ప్రియుడు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ కుమారి, అనూష తల్లీకూతురులు. వీరు పాలకొల్లు మండలం పూలపల్లిలో నివాసం ఉంటున్నారు. 

అనూష తల్లితో కలిసి విస్సాకోడేరుకు వెళ్లారు. అక్కడే అనూష ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. ఈక్రమంలో నయంతుల్లా అనే యువకుడితో అనూషకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి ఆరునెలలుగా పరిచయం ఉంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అనూషను తల్లి ఇంటి నుంచి బయటికి వెళ్లనివ్వలేదు. ఈక్రమంలో మంగళవారం (ఏప్రిల్ 30, 2019)న విస్సాకోడేరు దగ్గర తల్లితో కలిసి వెళ్తున్న అనూషను నయంతుల్లా బలవంతంగా కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశాడు. తల్లి అరుణ కుమారి అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చీర కారు డోర్ లో ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా కారు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలోనే కారును కంగారుగా డ్రైవ్ చేసిన నయంతుల్లా ఎదురుగా ఉన్న స్థంభాన్ని ఢీకొట్టడంతో కారు టైర్ పగిలిపోయింది. కారు రీమ్ తోనే దాదాపు పది కిలో మీటర్లు వెళ్లాడు. వెనుకాల బైక్ పై వస్తున్న కొంతమంది యువకులు కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. వెంటనే నయంతుల్లాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్ డ్రామా అంతా ఒక్కసారిగా బయటపడింది. కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

అనూష తనకు మెసేజ్ లు పెట్టి ఏదో ఒక రకంగా ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లమని చెప్పిందని నయంతుల్లా పోలీసులకు చెప్పాడు. ‘దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు. వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఉన్న విషయం తెలియదు. కావాలని నా కూతురిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోతున్నాడు’ అని తల్లి అరుణ కుమారి చెబుతోంది. ‘నాకు మత్తుగా ఉందని, బలవంతంగా కారులో ఎక్కించుకుని పోతున్నాడు’ అని అనూష పోలీసులకు చెబుతోంది. ‘ఇద్దరి మధ్య పరిచయం లేదు, కావాలని తీసుకెళ్తున్నారు’ అని తల్లి చెప్పిన దాన్ని వాంగ్మూలంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.