Kidney Racket
Kidney Racket : విశాఖ పెందుర్తి కిడ్నీ రాకెట్ గుట్టురట్టయ్యింది. డబ్బుల విషయంలో తేడా రావడంతో వ్యవహారం మొత్తం బయటపడింది. పెందుర్తిలోని తిరుమల హాస్పిటల్ లో వినయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకున్నారు. కిడ్నీకి రూ.8,50,000 ఇస్తామంటూ కామరాజు, శ్రీను అనే ఇద్దరు మధ్యవర్తులు వినయ్ కుమార్ కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారమే వినయ్ కుమార్ కిడ్నీ ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత రెండున్నర లక్షల రూపాయలే ఇవ్వడంతో వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కలెక్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న మెడికల్ ల్యాబ్ లో వినయ్ కుమార్ కు కామరాజు వైద్య పరీక్షలు చేయించాడు. అయితే ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తర్వాత వినయ్ కుమార్ కు డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ డాక్టర్, మధ్యవర్తులైన కామరాజు, శ్రీను పరారీలో ఉన్నట్లు సమాచారం.
2019లోనూ విశాఖపట్నంలో ఇలాంటి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకొని ఓ గ్యాంగ్ అతన్ని మోసం చేసింది. కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంటే మొదట 12లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకొని కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ జరిగాక 5లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్టు ముఠా గుట్టురట్టయ్యింది.
విశాఖ పెందుర్తి కిడ్నీరాకెట్ పై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. శ్రీ తిరుమల హాస్పిటల్ లో తనిఖీల కోసం DM&HO ఆధ్వర్యంలో టీమ్ ను ఏర్పాటు చేశారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్, అనుమతులపైన అనుమానాలు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండానే సర్జరీలు చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెందుర్తి కిడ్నీ రారెట్ పై 10టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారులు కదిలారు. కిడ్నీ రారెట్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. తిరుమల హాస్పిటల్ అనుమతులపై డీఎంహెచ్ వో ఆరా తీస్తున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా కల్పించారు. కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వైద్యులు వెళ్లారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.