వామ్మో..! పట్టాలపై రాళ్లు, గ్యాస్ సిలిండర్లు..! రైలు ప్రమాదాలే లక్ష్యంగా భారీ కుట్ర?

ఇలాటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.

Conspiracy To Derail Trains (Photo Credit : Google)

Conspiracy To Derail Trains : రైలు ప్రమాదాలే లక్ష్యంగా భారీ కుట్ర జరుగుతోంది. రైళ్లను పట్టాల నుంచి తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా కొందరు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. పట్టాలపై సిమెంట్‌ దిమ్మెలు, గ్యాస్‌ సిలిండర్‌లు, పెద్ద పెద్ద రాళ్లు, దుంగలు, రాడ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకటి కాదు…రెండు కాదు…గత మూడు నెలల కాలంలో 24 ఘటనలు వెలుగు చూశాయి. ఈ తరహా ఘటనలకు తెరపడేదెపుడు?

భారత్‌లో రైలు ప్రమాదాలకు పెరిగిన కుట్రలు..!
భారత్‌లో రైలు ప్రమాదాలకు జరుగుతున్న కుట్రలు ఇటీవల పెరిగిపోయాయి. ఎప్పుడు..ఎక్కడ..ఏ రైలు ప్రమాదానికి గురవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రైలు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి, రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యధికంగా బయటపడ్డాయి. పంజాబ్‌, ఝార్ఖండ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణలో కూడా ఈ కుట్రపూరిత యత్నాలు వెలుగు చూశాయి.

70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మను ఢీకొట్టిన రైలు..
తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. పూలేరా – అహ్మదాబాద్‌ రూట్‌లో రైల్వే ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్‌ దిమ్మెను అడ్డంగా పెట్టారు. వేగంగా వచ్చిన గూడ్సు రైలు- సిమెంట్‌ దిమ్మెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌ డ్యామేజ్‌ అయ్యింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద ప్రాంతంలో విరిగిన సిమెంట్‌ దిమ్మె భాగాలను గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సిలిండర్‌ పేలక పోవడంతో తప్పిన పెను ప్రమాదం..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ పెట్టి రైలు ప్రమాదానికి ప్లాన్ చేశారు దుండగులు. రైలు అతివేగంతో వెళ్తుండగా, పట్టాలపై ఎల్పీజీ సిలిండర్‌ ఉండటాన్ని గమనించిన లోకో పైలెట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినప్పటికీ రైలు సిలిండర్‌ను ఢీకొనడంతో అది పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. సిలిండర్‌ పేలక పోవడంతో కాళిందీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.

రైలును పట్టాలు తప్పించాలనే కుట్రతోనే..
ఘటనా స్థలంలో గ్యాస్‌ సిలిండర్‌తో పాటు పెట్రోల్‌ బాటిల్‌ను, అగ్గిపెట్టె, 4 గ్రాముల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైలును పట్టాలు తప్పించాలనే కుట్రతోనే ఈ పని చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖబాద్‌లో రైల్వే ట్రాక్‌పై పెద్ద కలప దుంగతో రైలు ప్రమాదానికి కుట్ర చేశారు. అప్రమత్తమైన లోకో పైలట్‌ ఎమర్జన్సీ బ్రేకులు వేయడంతో కాస్‌గంజ్‌ – ఫరూఖాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. మరో చోట రైల్వే ట్రాక్‌పై మోటార్ బైక్ విడి భాగాలను పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశారు దుండగులు. ఈ కుట్ర కూడా భగ్నమైంది.

చర్చనీయాంశంగా వరుస రైల్వే ప్రమాదాలు..
ఇలాటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. కుట్రపూరితంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని అనుమానిస్తున్న రైల్వేశాఖ ఆదిశగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. ప్రస్తుతం జరుగుతున్న వరుస రైల్వే ప్రమాదాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Also Read : అనంతలో డిగ్రీ విద్యార్థిని శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ.. హంతకుడు వాడే..!

ట్రెండింగ్ వార్తలు