Women Cheater Arrested
Man Arrested for Cheating Women : పెళ్లైన మహిళలను టార్గెట్ చేస్తూ.. వారిని మోసం చేస్తున్న ఓ స్త్రీలోలుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి.. దాదాపు 12 మంది మహిళలను మోసం చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌లో స్థిరపడ్డ రంగస్వామి.. లాలాగూడకు చెందిన మహిళను మోసం చేయడంతో అతడి వ్యవహారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన లాలాగూడ పోలీసులు.. దర్యాప్తు చేపట్టి రంగస్వామిని రిమాండ్‌కు తరలించారు. రంగస్వామిపై గతంలోనూ కేసులున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేపట్టిన లాలాగూడ పోలీసులు రంగస్వామి వేషాలు చూసి ఆశ్చర్యపోయారు.
అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చిన రంగస్వామి లాలాగూడలో నివాసం ఏర్పరుచుకున్నాడు. వివాహిత మహిళలను ట్రాప్ చేయటం… పరిచయం పేరుతో వారిని అమాయకపు మాయమాటలతో ఆకట్టుకుని, వారిని లోబరచుకోవటం మొదలెట్టాడు. వారిపై మోజు తీరాక వేరోక మహిళలకు వలవేయటం మొదలెట్టాడు. ఈసమయంలో వారి వద్ద నుంచి బంగారం, డబ్బులు కాజేసేవాడు.
బాగా డబ్బు ఉండి భర్తల నుంచి దూరంగా ఉన్న ఒంటరి మహిళలను, విడాకులు తీసుకున్న మహిళలను గుర్తించి వారినే ట్రాప్ చేయటం మొదలెట్టాడు రంగస్వామి. ఈవిధంగా లాలాగూడకు చెందిన మహిళను మోసం చేయటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగస్వామి బండారం బయటపడింది. గతంలోనూ ఒక మహిళను మోసం చేసిన కేసులో రంగస్వామి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.