Maoist Killed: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోలుకునే అవకాశమే లేకుండా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. రోజుకో ముఖ్య నాయకుడు ఎన్ కౌంటర్ లో మరణిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు, అగ్రనేతలు చనిపోయారు.
మొన్న మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు చనిపోయారు. అది మరువక ముందే నిన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్ కౌంటర్ లో మరణించారు. తాజాగా బీజాపూర్ లోనే జరిగిన ఎన్ కౌంటర్ లో మరో కీలక నేతను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడు మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు విడిచారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అడెల్లు అలియాస్ భాస్కర్ చనిపోయారు. భాస్కర్ సొంతూరు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం.
మంగీ దళ కమాండర్ గా భాస్కర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దళాన్ని తప్పించడంలో, ప్లానింగ్ వేయడంలో భాస్కర్ నిష్ణాతుడిగా పేరు పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుమార్లు పోలీసుల నుంచి అవలీలగా తప్పించుకున్నారు. చివరికి జవాన్ల తూటాలకు బలయ్యారు. 2022 డిసెంబర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భాస్కర్ భార్య లింగవ్వ చనిపోయింది. ఆ సమయంలోనూ ఆయన తప్పించుకున్నారు. అడెల్లుపై 25లక్షల రివార్డ్ ఉంది. డీఆర్జీ, ఎస్ టీఎఫ్, కోబ్రా సైనికులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. గతేడాది నుంచి ఊపందుకుంది. ఆపరేషన్ కగార్ లో మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. ఏప్రిల్ చివరి వారంలో అనేకమంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 24 మంది సరెండర్ అయ్యారు. అటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులను ఏరిపారేస్తున్నాయి.
మరోవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. జూలై 11 నుంచి ఆగస్ట్ 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తామంది.