Bank Fraud: కనీవిని ఎరుగని బ్యాంకింగ్ మోసం.. కస్టమర్ల డబ్బు 4కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.. ఎలా చీట్ చేసింది తెలిస్తే..

ఈ భారీ మోసం కస్టమర్లను భయబ్రాంతులకు గురి చేసింది. బ్యాంకు ఖాతాలో దాచుకున్న తమ డబ్బు సేఫ్టీపై వారు ఆందోళన చెందుతున్నారు.

Bank Fraud: కనీవిని ఎరుగని బ్యాంకింగ్ మోసం.. కస్టమర్ల డబ్బు 4కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.. ఎలా చీట్ చేసింది తెలిస్తే..

Updated On : June 6, 2025 / 9:09 PM IST

Bank Fraud: ఓవైపు సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. మనకు తెలియకుండానే మన ఫోన్లు హ్యాక్ చేసి మన బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును దోచుకుంటున్నారు. సైబర్ క్రిమినల్స్ నుంచే కాదు.. ఇప్పుడు కొందరు బ్యాంకు ఉద్యోగుల నుంచి కూడా కస్టమర్ల డబ్బుకు ముప్పు ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది. బ్యాంకులో పని చేసే సిబ్బంది, ఉన్నతాధికారులు కస్టమర్ల డబ్బుపై కన్నేస్తున్నారు. వారికి తెలియకుండా వారి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు కొట్టేస్తున్నారు. ఆ డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటున్నారు.

రాజస్తాన్ లో ఇలాంటి ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. కోటా బ్రాంచ్ ఐసీఐసీఐ బ్యాంకులో భారీ మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్ చేసిన నిర్వాకం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. బ్యాంక్ మేనేజర్ చీటింగ్ చేశారు. ఓటీపీ హ్యాక్స్ చేసి కస్టమర్ల డబ్బు కొట్టేశారు. ఏకంగా 4 కోట్ల 58 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి సర్వం కోల్పోయారు.

ఆమె పేరు సాక్షి గుప్తా. కోటా బ్రాంచ్ లో రిలేషన్ షిప్ మేనేజర్. 2020 నుంచి 2023 మధ్య మోసానికి పాల్పడ్డారు. 110 మంది కస్టమర్ల డబ్బు కొట్టేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కస్టమర్ కాంటాక్ట్ వివరాలను ట్యాంపరింగ్ చేయడానికి నకిలీ డిజిటల్ యాక్సెస్‌ను సాక్షి సృష్టించారని తేలింది. కస్టమర్ల అనుమతి లేకుండా ఆమె ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా తారుమారు చేశారు. మే 31న రాజస్థాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? బ్యాంక్ FDలపై తగ్గనున్న వడ్డీ రేట్లు.. కస్టమర్లు ఏం చేయాలంటే?

బ్యాంకు వ్యవస్థను తారుమారు చేసి ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుండి నిధులను మళ్లించారని, కస్టమర్ల పేర్ల మీద వ్యక్తిగత రుణాలు కూడా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాక్షి గుప్తా OTP వెరిఫికేషన్స్ దాటవేయడానికి అంతర్గత వ్యవస్థలను ఉపయోగించుకున్నారు. కస్టమర్ ఖాతాలలో నమోదైన మొబైల్ నంబర్లను మార్చి, వాటిని తన కుటుంబ సభ్యుల నంబర్లతో భర్తీ చేశారు. అలా వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు, లావాదేవీల అలర్ట్స్ కస్టమర్లకు చేరకుండా అడ్డగించారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కస్టమర్లకు ఎలాంటి అనుమానం రాలేదు.

బ్యాంకు ‘యూజర్ ఎఫ్‌డి’ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించి, ఆమె 31 మంది క్లయింట్లకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (మొత్తం రూ.1.35 కోట్లు) అనధికార ఖాతాల్లోకి బదిలీ చేశారు. మరొక వ్యక్తి పేరుతో రూ.3.4 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఇన్‌స్టా కియోస్క్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ప్లాట్‌ఫామ్ ల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. పలువురు కస్టమర్ల డెబిట్ కార్డులను కూడా ఉపయోగించారు.

సాక్షి గుప్తా కస్టమర్ల డబ్బు కొట్టేయడంతోనే ఆగిపోలేదు. సొంత కుటుంబ సభ్యుల ఖాతాలను కూడా వదల్లేదు. వారి ఖాతాల నుంచి 40-50 లక్షలు రూపాయలను స్టాక్ మార్కెట్‌లోకి మళ్లించారు. ఈ లావాదేవీలను కప్పిపుచ్చేందుకు ఆమె మొబైల్ నంబర్‌లను మార్చడం, అలర్ట్స్ వెళ్లకుండా బ్లాక్ చేయడం వంటి టెక్నిక్‌ను ఉపయోగించారు. అయిత, సాక్షి గుప్తాను దురదృష్టం వెంటాడింది. షేర్ మార్కెట్‌లో పెట్టిన డబ్బుంతా పోయింది.

ఫిబ్రవరి 15, 2023న ఒక సీనియర్ కస్టమర్ తన ఖాతా నుండి అనధికారికంగా రూ.3.22 కోట్లు విత్‌ డ్రా చేయడాన్ని గమనించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత, బ్రాంచ్ మేనేజర్ తరుణ్ దధిచ్ ఫిబ్రవరి 18న పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. మే 31న సాక్షి గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ భారీ మోసం కస్టమర్లను భయబ్రాంతులకు గురి చేసింది. బ్యాంకు ఖాతాలో దాచుకున్న తమ డబ్బు సేఫ్టీపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ”మా కస్టమర్ల ఆసక్తి మాకు అత్యంత ముఖ్యమైనది. మోసపూరిత కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే, మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఏదైనా మోసపూరిత కార్యకలాపాలను మేము పూర్తిగా సహించము. ఆ ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేశాము. బాధిత కస్టమర్లకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇస్తున్నాము” అని తెలిపారు.