మేఘాలయలో గని ప్రమాదం : ఇద్దరు మృతి 

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 02:19 AM IST
మేఘాలయలో గని ప్రమాదం : ఇద్దరు మృతి 

షిల్లాంగ్ : మేఘాలయలో మరో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈస్ట్ జయంతియా జిల్లాలో అక్రమ బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జలయా గ్రామంలోని గని నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు.

ఎలద్ బరే అనే వ్యక్తి కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని మృతదేహం అక్రమ బొగ్గు గని వద్ద పోలీసులకు లభ్యమైంది. మరికొంత లోపలికి వెళ్లి చూడగా మరో మృతదేహం కనిపించింది. బొగ్గు సేకరిస్తుండగా ఇద్దరు కూడా మృతి చెందారని పోలీసులు తెలిపారు. గని యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిషేధం కొనసాగుతున్నా మైనింగ్ చేస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 

2018, డిసెంబర్ 11న ఈస్ట్ జయంతియా జిల్లాలోని అక్రమ బొగ్గు గని సమీపంలో నది ముంచెత్తడంతో 15 మంది కూలీలు గనిలోనే చిక్కుకుపోయారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో అక్రమ మైనింగ్ ను నిషేదించింది. అయినా అక్రమంగా గనులు తవ్వడంతో ఎంతో మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.