చిన్నారి ద్వారక హత్య కేసు : వివాహేతర సంబంధాన్ని చూసిందని చంపేశారు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే ఆ చిన్నారి జీవితాన్ని నలిపేసింది. గోరుముద్దలు తినిపించాల్సింది పోయి.. ఘోరానికి ఒడిగట్టింది. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినందుకు… సొంత పేగుబంధాన్ని అతి కర్కశకంగా నలిపేసింది. బిడ్డను చంపేయని తల్లే చెప్పడంతో.. ఆమె ప్రియుడు ఆ చిన్నారిని పాశవికంగా హత్యచేశాడు. ఆపై మూట కట్టి, బీరువాలో దాచిన హృదయవిదాకర ఘటన కృష్ణాజిల్లా గొల్లపూడిలో చోటు చేసుకుంది. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఆ చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరోవైపు తల్లిని అర్ధరాత్రి వరకు విచారించిన పోలీసులు… నేడు మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించారు.
మొవ్వ అనిల్, వెంకటరమణలు భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో పనిచేస్తుండగా.. వెంకటరమణ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. తమ ఇద్దరు అబ్బాయిలను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక తల్లిదండ్రులతోనే ఉంటోంది. స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. వీరి పక్కింట్లో పెంటయ్య అలియాస్ ప్రకాష్ తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఆది వారం అతని భార్య బయటకు వెళ్లింది. అదే సమయంలో టీవీ చూసేందుకు ద్వారాక, పెంటయ్య ఇంటికి వెళ్లింది. అక్కడ తన తల్లి వెంకటరమణ, పెంటయ్య సన్నిహితంగా ఉండటాన్ని చూసింది. ఈ విషయమై తల్లిని నిలదీసింది. నాన్నకు చెబుతానంది. కంగారు పడిన వెంకటరమణ నువ్వే ఏదో ఒకటి చెయ్ అని పెంటయ్యకు చెప్పి హడావుడిగా బయటకు వెళ్లిపోయింది. నిందితుడు బాలికను తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని బయటకు తరలించే అవకాశం లేకపోవడంతో సంచిలో మూటగట్టి, దాన్ని బీరువా చాటున దాచాడు.
ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిపోయిన వెంకటరమణ సాయంత్రం ఇంటికి వస్తూనే ద్వారక ఏదంటూ భర్తను అడిగింది. ఆడుకునేందుకు వెళ్లిందేమో వస్తుందిలే అని చెప్పాడు. రాత్రి అయినా రాకపోవడంతో.. అందరితో కలిసి వెతుకుతున్నట్లు వెంకటరమణ నటించింది. ఆ తరువాత ద్వారక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు స్పందించి బాలిక ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.
పోలీసులు గాలింపు ముమ్మరం చేసి, ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఉదయం నుంచి తమతోపాటూ ఉంటూ చిన్నారి కోసం వెతికేందుకు సహకరించిన పెంటయ్యపై వారికి అనుమానం రాలేదు. సోమవారం పెంటయ్య భార్య సునీత, ఇంట్లోని పరుపును పక్కకు తీయగా మృతదేహం ఉన్న మూట కనిపించింది. నిర్ఘాంతపోయిన ఆమె విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో ద్వారక హత్య ఉదంతం బయటపడింది. వెంటనే పెంటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ముఖం, మెడపై కమిలిన గుర్తులు కనిపించాయి. రోజంతా బాలిక కోసం వెతికిన గ్రామస్థులు హత్య విషయం తెలుసుకుని.. పెంటయ్యను చితకబాదారు. నిందితుడిని ఉరితీయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఏవో కారణాలతో పెంటయ్య బాలికను చంపి ఉంటాడని ముందుగా అందరూ భావించారు. పోలీసుల విచారణలో వెంకటరమణతో వివాహేతర సంబంధం గురించి వెల్లడించారు. అతడిచ్చిన సమాచారంతో వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు విచారించారు. ఈరోజు కూడా హాజరుకావాలంటూ ఆదేశించారు. మరోవైపు కాసేపట్లో బాలిక మృతదేహానికి పోర్టుమార్టం నిర్వహించనున్నారు.