×
Ad

Secunderabad Robbery: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో భారీ చోరీ.. 50లక్షల విలువైన నగలతో పరార్..

ఓనర్ గిరి ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పక్కా స్కెచ్ వేశారు. మరో నలుగురి సాయంతో దంపతులు దోపిడీకి పాల్పడ్డారు.

Secunderabad Robbery: హైదరాబాద్ లో మరోసారి నేపాలీ దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది. దాదాపు 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదును అపహరించుకుపోయారు.

సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ చోరీ జరిగింది. గన్ రాక్ ఎంక్లేవ్ లో నివాసం ఉండే ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో నేపాలీ దొంగల గ్యాంగ్ దొంగతనం చేసింది. ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన దంపతులు.. మరో నలుగురితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసి నగదు నగలను అపహరించుకుని నేపాల్ దొంగల ముఠా పరార్ అయ్యింది. 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదుతో ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పక్కా ప్లాన్ తో చోరీ..

ఓనర్ గిరి ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పక్కా స్కెచ్ వేశారు. మరో నలుగురి సాయంతో దంపతులు దోపిడీకి పాల్పడ్డారు. ఓనర్ గిరి ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. జ్యూస్ లో మత్తుమందు కలిపి.. వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు ఇచ్చిన జ్యూస్ తాగి రిటైర్డ్ కల్నల్ గిరి భార్య స్పృహ కోల్పోయారు. అయితే, అనుమానం రావడంతో ఆ జ్యూస్ తాగకుండా స్పృహ కోల్పోయినట్లు గిరి నటించారు. నేపాలీ దంపతులు మరో నలుగురిని ఇంట్లోకి పిలిచి దోపిడీకి పాల్పడ్డారు. దొంగతనం సమయంలో ఓనర్ గిరి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గిరిపై దాడి చేసి ఆయనను తాళ్లతో బంధించారు.

Also Read: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత

”తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కాల్ వచ్చింది. వెంటనే మా వాళ్లు స్పాట్ కి వెళ్లారు. గన్ రాక్ ఫేజ్ 2లో ప్లాట్ నెంబర్ 210లో డీకే గిరి నివాసం ఉంటారు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు సమాచారం ఇచ్చారు. గిరి పడుకున్న టైమ్ లో 12.15 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చారు. గిరిని భయపెట్టారు. ముఖానికి మాస్క్ వేశారు. అరవకుండా మూతికి ప్లాస్టర్ అతికించారు. చేతులు కట్టేశారు. బలవంతంగా ఆయన మెడలో నుంచి చైన్, తర్వాత బ్రాస్ లెట్, రింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఉండే నగలు, నగదుతో పారిపోయారు. నేపాల్ కు చెందిన దంపతులు పూజ, రాజు.. గత నెల 21వ తేదీన గిరి దగ్గర పనికి చేరారు. నలుగురు వ్యక్తులు గిరి ఇంటికి వచ్చారు. డోర్ తీయగానే లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆరుగురు పారిపోయారు. గిరితో పాటు ఇంట్లో ఆయన తల్లి (90+) ఉంటుంది. గిరి భార్య తల్లి చనిపోడంతో.. ఆమె అక్కడికి వెళ్లింది. గిరి కూడా అత్తగారి ఇంటికి వెళ్లి రాత్రి తన ఇంటికి తిరిగొచ్చారు. దొంగలను పట్టుకునేందుకు 6 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నాం. యూపీ పోలీసులతో కూడా మేము టచ్ లో ఉన్నాం” అని కార్ఖానా ఏసీపీ రమేశ్ తెలిపారు.