Visakha Honey Trap Case : విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ఓ కీలక అధికారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటవీశాఖ అధికారి వేణు రెడ్డికి కిలేడీ జాయ్ జెమీమాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జెమీమా ఫోన్ లో ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల విచారణకు హాజరైన వేణు రెడ్డి.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేణు రెడ్డి పరారీలో ఉన్నారని, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం.
హనీ ట్రాప్ కేసు విచారణలో అనేక ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు పెళ్లి కాని యువకులను, అలాగే పెళ్లి అయిన వారిని టార్గెట్ చేసి జాయ్ జెమీమా అండ్ గ్యాంగ్.. వారి నుంచి కోట్ల రూపాయలు కొట్టేసిన వైనం వెలుగుచూసింది. తాజాగా కిలేడీ జాయ్ జెమీమా వ్యవహారంలో అనేకమంది పేర్లు బయటకు వస్తున్నాయి. అనేకమంది జాయ్ జెమీమా వెనుక ఉండి ఈ తతంగం అంతా నడిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక అటవీశాఖ అధికారి వ్యవహారం గుట్టురట్టైంది.
జాయ్ జెమీమాను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసు అధికారులకు ఫోన్ చేసి.. ఆమెను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని, ఏ ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులతో కొంత దురుసుగా ఆ అటవీశాఖ అధికారి మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ అటవీశాఖ అధికారిపై ఫోకస్ పెట్టారు. జాయ్ జెమీమా బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపైనా దృష్టి సారించారు. ఈ క్రమంలో జాయ్ జెమీమా బ్యాంకు ఖాతా నుంచి ఫారెస్ట్ అధికారి వేణు రెడ్డి బ్యాంకు ఖాతాలోకి నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
దీంతో పోలీసులు ఆ అటవీశాఖ అధికారిని రెండు రోజుల పాటు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. అయితే, అప్పటి నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోసారి ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తామంటున్నారు.
జాయ్ జెమీమా ముఠాలో అనేకమంది ఉన్నారు. వారిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టారు. జాయ్ జెమీమా వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జాయ్ జెమీమా గ్యాంగ్.. బాధితులపై ప్రయోగించిన మత్తుపదార్ధం(స్ప్రే, డ్రింక్) పైన లోతైన విచారణ చేస్తున్నారు. వారు వాడిన స్ప్రే ఏంటి? ఎలా మత్తులోకి దించుతున్నారు? ఎంత మొత్తం మేర బాధితుల నుంచి గుంజారు? ఈ అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఓవైపు బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తుంటే.. మరోవైపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక్కో అధికారి పేరు బయటకు రావడం సంచలనంగా మారింది.
Also Read : వాలంటీర్ హత్య కేసులో కీలక మలుపు.. మాజీమంత్రి కుమారుడు అరెస్ట్..!