వాలంటీర్ హత్య కేసులో కీలక మలుపు.. మాజీమంత్రి కుమారుడు అరెస్ట్..!
2022 జూన్ 6వ తేదీన వాలంటీర్ దుర్గాప్రసాద్ అదృశ్యమైనట్లు అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Pinipe Srikanth Arrest : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీమంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. మధురైలోని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై శ్రీకాంత్ ను ఏపీకి తీసుకొస్తున్నారు పోలీసులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళిత యువకుడి హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసు విచారణ కీలక మలుపు తీసుకుంది. అయినవిల్లిలో వాలంటీర్ గా పని చేస్తున్న దుర్గాప్రసాద్ రెండేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. ఈ కేసులో విచారణను గత రెండు నెలల నుంచి పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీమంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను మధురైలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. శ్రీకాంత్ అరెస్ట్.. ఈ కేసులో కీలకమైన మలుపుగా చెప్పొచ్చు.
2022 జూన్ 6వ తేదీన దుర్గాప్రసాద్ అదృశ్యమైనట్లు అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదే నెల 10వ తేదీన గోదావరి తీరాన దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యమైంది. వైసీపీ పాలనలో ఈ కేసులో దర్యాఫ్తును స్థానిక నేతలు పూర్తి స్థాయిలో నీరుగార్చారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక మంత్రి సుభాష్ చొరవతో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.
ఈ కేసులో కీలకంగా ఉన్న ధర్మేష్ ను ఈ నెల 18న అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆ విచారణలో ధర్మేష్ కీలకమైన విషయాలను పోలీసులకు తెలిసినట్లు సమాచారం. ఈ హత్య కేసులో నలుగురు నిందితులతో పాటు ప్రధాన నిందితుడిగా పినిపె శ్రీకాంత్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సుమారు 6 పోలీస్ బృందాలు.. ఆ నలుగురి కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలో పినిపె శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాంత్ అరెస్ట్ తో ఇక ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ మరింత వేగవంతం కానుందని పోలీసులు అంటున్నారు. శ్రీకాంత్ తో పాటు మరో నలుగురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని.. వారి కోసం కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. శ్రీకాంత్ ను విచారిస్తే వాలంటీర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ధర్మేష్ ఇచ్చిన వాంగూల్మం ఆధారంగా శ్రీకాంత్, మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
Also Read : ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుంది..! తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..