Brij Bhushan Case: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మద్దతుగా కోర్టులో కేసు వాదించనున్న లాయర్ ఎవరో కాదు, అప్పట్లో నిర్భయ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన అడ్వకేట్ రాజీవ్ మోహన్. 2012 నాటి నిర్భయకాండలో దోషులకు మరణశిక్ష విధించాలని కోరిన ఆయన న్యాయవాదే.. మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ తరపున వాదనలు వినిపించి రెండు రోజుల బెయిల్ రావడానికి కారణమయ్యారు. ఇక ఈ కేసు విచారణ జూలై 20 నుంచి పున:ప్రారంభం అవుతుంది.
2012 నిర్భయ కేసులో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులు దోషులుగా నిర్ధారించబడి, మార్చి 2020లో ఉరితీశారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా భారీ నిరసనలను రేకెత్తించింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల కోసం డిమాండ్‌ను కూడా లేవదీసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏడాది కాలంగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. కాగా, జూన్ 2న ఢిల్లీ పోలీసులు రెజ్లర్ల ఆరోపణలపై చర్య తీసుకున్నారు. బ్రిజ్ భూషన్ మీద లైంగిక వేధింపులకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఫిర్యాదులను నమోదు చేశారు.
డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదులలో ఆయన అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం, ఛాతీ నుంచి వెనుకకు తన చేతిని తాకించడం, వారిని వెంబడించడం వంటి చర్యలను పేర్కొన్నారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు జూన్ 15న సెక్షన్ 354 (ఆమె నిరాడంబరతను కించపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 354A (లైంగిక వేధింపులు), 354డి (వెంబడించడం) ఐపీసీ 506 (నేరపూరిత బెదిరింపు) ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలన్నింటినీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఖండించారు.