చావు తెలివి తేటలు : నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని ఉరితీయరాదని తీహార్ జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఇచ్చిన డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గుప్తా కోరాడు. దీంతో విచారణ అనంతరం ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. స్టే ఇవ్వడం ఇది మూడోసారి. జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్ వారెంట్లు ఇచ్చింది. కానీ గుప్తా పిటిషన్‌తో అది కూడా ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్ వారెంట్లపై స్టే విధించింది పటియాలా హౌస్ కోర్టు. మళ్లీ కోర్టు ఆదేశాలు వచ్చేవరకు నిర్భయ దోషులకు ఉరి లేనట్టే.
కోర్టు కొత్త తేదీలపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ పవన్ గుప్తా తరపున మెర్సీ పిటిషన్ వేశారు. రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో తదుపరి ఆదేశాలు వెలువడేంతవరకూ దోషులను ఉరి తీయరాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చత్తీస్‌ఘడ్ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పవన్ గుప్తా మెర్సీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా పడడంతో నిర్భయ తల్లి ఆశాదేవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి శిక్ష మరోసారి వాయిదా పడడం మన వ్యవస్థ వైఫల్యమే అని ఆమె పేర్కొన్నారు. మన వ్యవస్థ మొత్తం నేరస్థులకే మద్దతు ఇస్తుందన్నారు. సొంత డెత్ వారెంట్ ఉత్తర్వులను అమలు చేసేందుకు కోర్టు ఎందుకింత జాప్యం చేస్తుందని ఆశాదేవీ ప్రశ్నించారు. ఉరిశిక్ష పదేపదే వాయిదా పడడం మన వ్యవస్థ వైఫల్యమే అని ఆమె స్పష్టం చేశారు.