Courier Fraud (Photo Credit : Google)
Courier Fraud : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. బాగా చదువుకున్న వారిని, విద్యావంతులను సైతం ఇట్టే చీట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొరియర్ పేరుతో మోసాలు పెరిగిపోయాయి. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి బాధితుల నుంచి దొరికినంత దోచుకుంటున్నారు కేటుగాళ్లు. కొరియర్ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి పోలీసులు అలర్ట్ చేస్తున్నా, అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు అడ్డంగా మోసపోతున్నారు. తాజాగా ఢిల్లీలో ఇదే తరహాలో ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. ఓ మహిళా టెక్కీ అడ్డంగా మోసపోయింది. రూ.20 లక్షలు పొగొట్టుకుంది.
బాధితురాలు నోయిడాలో నివాసం ఉంటుంది. ఆమె ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఇంటి నుంచే పని చేస్తుంది. ఓ రోజు ఆమెకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీలో తాను పని చేస్తానని ఆ వ్యక్తి ఆమెతో చెప్పాడు. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ కొరియర్ ను పోలీసులు సీజ్ చేశారని తెలిపాడు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని ఆ మహిళను బెదిరించాడు.
ఆ తర్వాత మరికొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. తమను తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని వారు కూడా చెప్పడంతో ఇదంతా నిజమేనేమో అనుకుని ఆ మహిళ భయపడిపోయింది. మేము చెప్పినట్లు చేయకపోతే కచ్చితంగా మిమల్ని అరెస్ట్ చేస్తామని కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేశాడు. అప్పటికే బాగా భయపడిపోయిన మహిళ.. వారు చెప్పినట్లు చేసేందుకు ఒప్పుకుంది.
వెంటనే తాము సూచించిన బ్యాంకు అకౌంట్ కు రూ.20 లక్షలు పంపించాలన్నారు. అలా చేయకపోతే అరెస్ట్ అవుతారని భయపెట్టారు. దీంతో కంగారుపడిపోయిన మహిళ అప్పటికప్పుడు ప్రైవేట్ బ్యాంకు నుంచి 20లక్షల రూపాయలు లోన్ గా తీసుకుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తామని కేటుగాళ్లు చెప్పారు. ఆ మాటలను నమ్మేసిన మహిళ.. మోసగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.20లక్షలు పంపింది. అంతే, ఆ వెంటనే ఫోన్ కాల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత బాధితురాలు ఎంత ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకపోయింది. ఆ నెంబర్ స్విచ్చాఫ్ వచ్చింది. కాసేపటి తర్వాత తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు లబోదిబోమంది. వెంటనే భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. అతడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు..
Also Read : బాబోయ్.. చెప్పులు బయట విడవమన్నందుకు డాక్టర్‌ని ఎంత దారుణంగా కొట్టారో.. షాకింగ్ వీడియో
ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోయాయి. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ తరహా మోసాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. కొరియర్ పేరుతో వచ్చిన ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ అవ్వొద్దని సూచించారు. కేటుగాళ్లు భయపెట్టినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడొద్దని, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.