Cyber Fraud Representative Image (Image Credit To Original Source)
Cyber Fraud: సైబర్ నేరాల పట్ల పోలీసులు నిత్యం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూనే ఉన్నారు. ఏ విధంగా సైబర్ నేరాలు జరుగుతాయో వివరిస్తూనే ఉన్నారు. వారి ఎరకు చిక్కొద్దని సూచిస్తూనే ఉన్నారు. అయినా, ఇంకా కొందరు సైబర్ మోసాల బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఘరానా సైబర్ మోసం జరిగింది. సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలి నుంచి ఒక కోటి 34 లక్షల రూపాయలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బు కాజేశారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు..
బాధితురాలు ఢిల్లీలో నివాసం ఉంటుంది. వయసు 85 సంవత్సరాలు. ఆమె వాట్సాప్ కి గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి. ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి ఇలా అన్నాడు. మీరు తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోనున్నారు అని మోసగాళ్ళు ఆమెను బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు, విచారణ నుంచి బయటపడేందుకు డబ్బు బదిలీ చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు.
నెల రోజుల వ్యవ్యధిలో కోటి రూపాయలు కాజేశారు..
మోసగాళ్లు చెప్పిన మాటలను పెద్దావిడ నమ్మేసింది. తనను అరెస్ట్ చేస్తారేమోనని భయపడింది. వారు చెప్పినట్లే డబ్బు పంపడం స్టార్ట్ చేసింది. అలా నెల రోజుల వ్యవధిలో మోసగాళ్లు పలు లావాదేవీల ద్వారా ఆమె బ్యాంకు ఖాతాల నుండి కోటి 34 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. అయినా ఇంకా డబ్బు కోసం వేధింస్తుండటంతో.. వృద్ధురాలికి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన వాట్సాప్ నంబర్లను గుర్తించడంతో పాటు, డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థల నుండి వచ్చినట్లుగా నటిస్తూ డబ్బు డిమాండ్ చేసే కాల్స్ లేదా సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు ముఖ్యంగా వృద్ధులకు విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఏ అధికార సంస్థ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అరెస్టులు లేదా చట్టపరమైన చర్యలు చేపట్టదని వారు తేల్చి చెప్పారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ అటెండ్ చేయొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
Also Read: భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది.. ఇక భవిష్యత్తులో రోగులు అందరూ