Visakha Honey Trap Gang : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అడ్డంగా మోసపోవడం ఖాయం. మరీ ముఖ్యంగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో చాలా కేర్ ఫుల్ ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. మీ జేబులు, బ్యాంకు ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. విశాఖలో వెలుగుచూసిన ఓ ఘరానా మోసం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలేం జరిగిందంటే..
ఫోన్ చేసి.. మీరు నాకు తెలుసు అన్న మహిళ..
రామారావు అనే వ్యక్తికి ఈ నెల 18న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ పక్క నుంచి ఓ మహిళ మాట్లాడింది. రామారావు.. మీరు ఎవరు అని అడిగాడు. దానికి ఆమె మీరు నాకు తెలుసు అని చెప్పింది. స్వీట్ వాయిస్ తో అతడిని అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత మాయమాటలు చెప్పి అతడిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 19వ తేదీన మరోసారి ఆ మహిళ రామారావుకి ఫోన్ చేసింది. ఇద్దరం కలుద్దాం అని అతడితో చెప్పింది.
మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించింది..
ఆమె మాయమాటలు నమ్మేసిన రామారావు.. ఆ గుర్తు తెలియని మహిళను కలిసేందుకు రెడీ అయిపోయాడు. తగరపువలస పరిధిలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం దగ్గర ఆ మహిళ కోసం వెయిట్ చేయసాగాడు. ఇంతలో అతడికి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు వ్యక్తులు బైకులపై అతడి దగ్గరికి వచ్చారు. అక్కడ ఒంటరిగా ఉన్న రామారావుని రౌండప్ చేసి బెదిరించారు.
Also Read : ఇదెక్కడి ట్విస్ట్‌రా మావా.. సైఫ్ ఇంట్లో అటాక్ చేసినోడి ఫింగర్ ప్రింట్స్ అక్కడ లేవట
దాడి చేసి డబ్బులు లాక్కున్న దుండగులు..
రామారావుని తమతో పాటు బైక్ ఎక్కించుకున్నారు. భీమిలి మండలం దాకమర్రి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి రామారావుని తీసుకెళ్లారు. అక్కడ అతడిపై దాడి చేశారు. అతడి దగ్గరున్న 40వేల రూపాయలు లాక్కున్నారు. అంతేకాదు అతడి మొబైల్ ఫోన్ తీసుకుని ఫోన్ పే ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న 8వేల 900 రూపాయలు కూడా ట్రాన్సఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత రామారావుని అక్కడే వదిలేసి వారంతా పారిపోయారు. ఊహించని ఘటనతో రామారావు బిత్తరపోయాడు. షాక్ లో ఉండిపోయాడు.
నిందితులను పట్టుకున్న పోలీసులు..
తర్వాత ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఏ విధంగా మోసపోయానో వారికి వివరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం జల్లెడపట్టారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఫోన్ చేసి రామారావుని బురిడీ కొట్టించిన మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన మహిళకు, పాత నేరస్తుడికి పరిచయం ఉంది. అతడు ఇచ్చిన సలహా మేరకే.. ఆ మహిళ రామారావుకి ఫోన్ చేసిందని పోలీసులు తెలిపారు.
Also Read : బాబోయ్.. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల్లో ఈ భయంకరమైన జబ్బు వచ్చే ప్రమాదం ఉందట..!
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో జాగ్రత్త..
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్ కు స్పందించకపోవడమే మేలు అన్నారు. ఇక, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు ఎంతమాత్రం మంచివి కాదన్నారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని, లేదంటే ఇదిగో ఇలానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.
ఇలాంటి ఘటనల్లో అవతలి వ్యక్తులపై ఎలాంటి అనుమానం కలిగినా.. వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. అంతేకాదు.. ఇలాంటి కేసుల్లో బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే క్రిమినల్స్ ఆట కట్టిస్తామన్నారు పోలీసులు.