Teachers Harass: టీచర్ల రాక్షసత్వం.. 8ఏళ్ల విద్యార్థి ప్యాంటులో తేలు వేసి.. తీవ్రంగా కొట్టి.. టార్చర్ పెట్టారు..
పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని కూడా బెదిరించారని అతడు తెలిపాడు.
                            
Teachers Harass: గురువు అంటే దైవంతో సమానం అంటారు. విద్యార్థికి విద్యను బోధించి సన్మార్గంలో వెళ్లేలా చూసే వాడే గురువు. అందుకే, గురువును దైవ సమానులు అంటారు. అయితే, ఆ టీచర్లు పవిత్రమైన ఉపాధ్యాయం వృత్తికి కళంకం తెచ్చారు. విద్యార్థి పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఆ విద్యార్థిని బాగా కొట్టారు, టార్చర్ పెట్టారు. కులవివక్ష చూపించారు. అంతేకాదు అతడి ప్యాంటులోకి తేలు పంపి పైశాచిక ఆనందం పొందారు.
సిమ్లా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘోరం వెలుగుచూసింది. దళిత వర్గానికి చెందిన ఒక బాలుడి పట్ల ఇద్దరు టీచర్లు, హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించారు. కుల వివక్ష చూపించడంతో పాటు శారీరక దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో.. ముగ్గురు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలుడు.. సిమ్లా జిల్లాలోని రోహ్రు సబ్ డివిజన్‌లోని కద్దపాణి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. దాదాపు సంవత్సరం పాటు హెడ్ మాస్టర్ దేవేంద్ర, టీచర్లు బాబు రామ్, కృతికా ఠాకూర్ తన కొడుకుపై తరచుగా దాడి చేస్తున్నారని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో ఆ చిన్నారి చెవిలోంచి రక్తం కారిందని, ఒక సమయంలో చెవి కూడా దెబ్బతిందని అతడు కన్నీటిపర్యంతం అయ్యాడు.
అంతేకాదు.. ఓ రోజు తన కొడుకును స్కూల్ టాయిలెట్‌కు తీసుకెళ్లి అతని ప్యాంటులో తేలును పెట్టారని తండ్రి ఆరోపించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భారతీయ న్యాయ సంహిత కింద నిర్బంధం, దాడి, క్రిమినల్ బెదిరింపుల సెక్షన్లు, బాలల న్యాయ చట్టం, పిల్లల పట్ల క్రూరత్వం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
టీచర్ల వేధింపులు ఏ స్థాయికి వెళ్లాయంటే.. తన కొడుకుని స్కూల్ నుండి బహిష్కరిస్తానని బెదిరించారని తండ్రి వాపోయాడు. అంతేకాదు “మేము నిన్ను తగలబెడతాము” అని వార్నింగ్ కూడా ఇచ్చారట. పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని కూడా బెదిరించారని అతడు తెలిపాడు.
ఆ స్కూల్ లో టీచర్లు కుల వివక్ష చూపిస్తున్నారని బాలుడి తండ్రి ఆరోపించాడు. భోజనం సమయంలో రాజ్‌పుత్ విద్యార్థుల నుండి నేపాలీ, దళిత విద్యార్థులను విడిగా కూర్చోబెట్టేవారని చెప్పాడు.
కాగా, మరో షాకింగ్ విషయం ఏంటంటే..రోహ్రులో విద్యార్థులపై టీచర్లు దాడి చేయడం లేదా కుల వివక్ష చూపడం ఇది మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం రోహ్రులోని గవానా ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని ముళ్ల కర్రతో కొట్టాడో టీచర్. రోహ్రులోని లిమ్డా గ్రామంలో 12 ఏళ్ల దళిత బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నత కుల మహిళల ఇంట్లోకి ప్రవేశించినందుకు ఆ బాలుడిని గోశాలలో బంధించారు. ఆ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు.
