దొంగలు దొరుకుతారా : పోలీస్ స్పీడ్ 60 మాత్రమే

దొంగలు దొరుకుతారా : పోలీస్ స్పీడ్ 60 మాత్రమే

Updated On : February 4, 2019 / 4:17 AM IST

పోలీసుల వాహనాల స్పీడు తగ్గించాలని పెట్టిన షరతులు దొంగల పాలిట వరంగా మారుతున్నాయి. చేజింగ్ చేసేందుకు వెళ్తున్న పోలీసులు వట్టి చేతుల్తో తిరిగొస్తున్నారు. దానికి కారణం పెట్రోలింగ్ వాహనాలు స్పీడు 60కి మించి ప్రయాణించకూడదనే షరతు ఉండటమే. ఫలితంగా దొంగ ముందు వెళ్తున్నా అతనిని చూస్తూ ఉండడం తప్ప వెంబడించి పట్టుకోలేని దుస్థితి. 

సైబరాబాద్ పోలీసులు ఇటీవల చోటు చేసుకున్న ఘటన ఫలితంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏసీపీ స్థాయి అధికారి నుంచి ఏ వాహనమూ గంటకూ 60కి.మీ వేగం మించకుండా లాక్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే దాఖలాలే లేవు. 

అసలేం జరిగిందంటే, జనవరి మూడో వారంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున డ్యూటీలో ఉన్న వాహనానికి కుక్క అడ్డురావడంతో తప్పించబోయి పల్టీకొట్టింది. దాంతో వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాంతో డ్రైవర్‌ను పక్కనే కూర్చుని ఉన్న కానిస్టేబుల్‌ను వెనుకు సీట్లో ఉన్న సబ్ ఇన్‌స్సెక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. జరిగింది ప్రమాదమైతే డ్రైవర్‌కు శిక్ష ఎందుకు విధించారో అర్థం కాని పరిస్థితి. పైగా ఇక నుంచి వాహనాలు వేగం మీరకూడదంటూ నియమాలు పెట్టి పోలీసుల చేతులు కట్టేస్తున్నారు. 

తరచూ వాహనాల సంఖ్య పెరుగుతుందే తప్ప దానికి తగ్గట్లుగా డ్రైవర్ల సంఖ్య పెరగడం లేదు. ఒకవేళ ప్రత్యామ్నాయంగా డ్రైవర్లను నియమించినా వారికి సరైన నైపుణ్యం లేకపోవడంతో ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. నైపుణ్యం లేని డ్రైవర్లతో డ్రైవింగ్ చేయిస్తూ.. 60కి.మీ మించని వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగని మాట వాస్తవమే. కానీ, ప్రభుత్వం కొత్త వాహనాలను ఇచ్చింది పోలీసులు పనిని వేగవంతంగా పూర్తి చేస్తారనే కదా. అలాంటిది వారి చేతులు కట్టేసే ఈ నియమాలు ఎందుకో..?!