తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి

తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident in tamil nadu

Tamilnadu Accident :  తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువళ్లూరు సమీపంలోని రామంచెరి వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఐదు మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన వారు. ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీష్ (21), తిరుపతికి చెందిన యుగేశ్ (23), చేతన్ (22), కర్నూలుకు చెందిన రామ్మోహన్ (21), విజయవాడకు చెందిన బన్ను నితీష్ (22) ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య తీవ్రంగా గాయపడ్డారు.

Also Read : సిద్ధనాథ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో భక్తులు మృతి

వీరంతా చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వారంతా శనివారం కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నైకు బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకొని స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విష్ణు, చైతన్యను తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

ట్రెండింగ్ వార్తలు