Son Attack Father : మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సొంత తండ్రిని కొడుకే కత్తితో పొడిచాడు. తండ్రి దేహంపై 15 కత్తిపోట్లు ఉన్నాయి. కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న తండ్రిని పోలీసులు ఈసీఐఎల్ లోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు.
తండ్రి దేహంపై 10 నుంచి 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంతోనే తండ్రిపై తనయుడు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుషాయిగూడ పోలీసులు.
Also Read : ఘరానా మోసం.. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ వచ్చిందా? మాట్లాడారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడం ఖాయం..!
ఈ కేసు వివరాలను ఏసీపీ మహేశ్ గౌడ్ తెలిపారు. ”తండ్రి, తనయుడి మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు గుర్తించాం. లాలాపేట నుండి బస్సులో ఈసీఐఎల్ కు తండ్రి ఆర్ఎల్ మొగిలి వచ్చాడు. బైక్ పై తండ్రిని వెంబడించిన కొడుకు సాయికుమార్ బస్ స్టాప్ లో బస్సు దిగి వస్తున్న తండ్రిపై కత్తితో దాడి చేశాడు.
బస్ స్టాప్ ముందు ఉన్న మెడ్ ప్లస్ ముందు కత్తితో దాడి చేసి 15సార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న తరుణంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం” అని ఏసీపీ తెలిపారు.