ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్ర‌యాణం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం

లారీని ఢీకొనడంతో ప్రైవేట్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. నలుగురు చనిపోగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు.

ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్ర‌యాణం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం

Tamil Nadu Road Accident: తమిళనాడులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెంగల్పట్టు సమీపంలో చెన్నై- తిరుచిరాపల్లి హైవేపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చెంగల్‌పట్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

మదురాంతకం వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఎం ధనుష్ (18), ఎం కమలేష్ (19), ఎస్ మోనీష్ (18), రవిచంద్రన్ (19)గా గుర్తించారు. మంగళవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో నలుగురు బాలురు, ఇతరులతో కలిసి బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

లారీని ఢీకొనడంతో ప్రైవేట్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. నలుగురు చనిపోగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు గాయపడిన విద్యార్థులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనుష్, కమలేష్, మోనీష్ అక్కడికక్కడే మృతి చెందగా, రవిచంద్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేల్మరువత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read: హైదరాబాద్ నకిలీ పాస్‌పోర్టుల స్కాం కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు అరెస్ట్!