Student Set Fire: కాలేజీలో కలకలం.. నిప్పంటించుకున్న విద్యార్థిని.. అతడి వేధింపులు తట్టుకోలేక..!

కాలేజీ అధికారులు కానీ పోలీసులు కానీ నిందితుడైన ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె వేదన మరింత పెరిగిందని స్నేహితులు అన్నారు.

Student Set Fire: పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన గురువే దారితప్పాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ కీచకుడిగా మారాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశాడు. అతడి వేధింపులు తాళలేకపోయిన విద్యార్థి కాలేజీలోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఒడిశాలోని బాలాసోర్ లో ఈ దారుణం జరిగింది.

ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ చదివే యువతిని లైంగిక వేధింపులకు గురి చేశాడు హెచ్ వోడీ సమీర కుమార్ సాహు. తన కోరిక తీర్చాలని విద్యార్థిని వేధించాడు. అతడి వేధింపులు తాళలేకపోయిన విద్యార్థి.. అతడిపై ఫిర్యాదు చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది. కాలేజీలోనే ఆత్మహత్యాయత్నం చేసింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 90శాతం కాలిన గాయాలతో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తర్వాత పోలీసులు సమీర్ ను అరెస్ట్ చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు.

‘ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాల ఆవరణలో ఒక ఉపాధ్యాయుడు నిరంతర లైంగిక వేధింపుల కారణంగా ఒక మహిళా విద్యార్థిని తనను తాను నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన ఒక విద్యార్థి కూడా గాయపడ్డాడు. ఇద్దరినీ జిల్లాలోని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు’ అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒడిశా ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ స్పందించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర కుమార్ సాహును సస్పెండ్ చేసింది. ”ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని కేసులో ఒక ఉపాధ్యాయుడిపై ప్రాథమికంగా ఆధారాలు లభించాయి. అతడిని అరెస్ట్ చేశాము. బాధితురాలు జూన్ 30న కమిటీకి ఫిర్యాదు చేసింది. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాము” అని బాలసోర్ ఎస్పీ తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం విద్యార్థినిని ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. హెచ్ వోడీ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోందని ఆమె స్నేహితులు తెలిపారు. కాలేజీ అధికారులు కానీ పోలీసులు కానీ నిందితుడైన ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె వేదన మరింత పెరిగిందని స్నేహితులు అన్నారు.

బాధితురాలు ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ ప్రోగ్రామ్‌లో సెకండియర్ చదువుతోంది. నివేదిక ప్రకారం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ టీచర్(హెచ్ వోడీ కూడా) పై విద్యార్థిని ఫిర్యాదు చేసింది. అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కీచకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక వారం పాటు కళాశాల క్యాంపస్‌లో నిరసన కూడా నిర్వహించింది. టీచర్ పై చర్య తీసుకోవాలని కోరుతూ విద్యార్థిని తన వద్దకు వచ్చిందని ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ తెలిపారు.

Also Read: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. రూ.65 లక్షలు వసూలు చేసిన కేటుగాడు.. స్కామ్ బయటపడిందిలా..

“ఆమె బాగా ఆవేశంగా కనిపించడంతో నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. జూన్ 30న ఫిర్యాదు చేసింది. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసిసి) విచారణ జరుగుతోంది” అని ఆయన తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కీచక టీచర్ ని అరెస్ట్ చేశారు. అటు 90శాతం కాలిన గాయాల కారణంగా విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తోటి విద్యార్థుల ముందే బాధితురాలు నిప్పంటించుకుంది. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఇది కళ్లారా చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన టీచర్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.