Railway Job Scam: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. రూ.65 లక్షలు వసూలు చేసిన కేటుగాడు.. స్కామ్ బయటపడిందిలా..
వ్యక్తులను నమ్మించేందుకు ఫోర్జరీ చేసిన అడ్మిట్ కార్డులు, నకిలీ పరీక్షలు, మెడికల్ టెస్టులు చేయించాడని తేలింది.

Railway Job Scam: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అదీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్ అంటే ఆశపడని వారు ఉండరు. సరిగ్గా ఈ పాయింట్ ను క్యాచ్ చేసిన ఓ కేటుగాడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. అమాయకుల నుంచి 65 లక్షలు వసూలు చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
ఒడిశాలోని బెర్హమ్ పూర్ లో రైల్వే జాబ్ ఫ్రాడ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. విఘ్నేశ్వర్ రావ్ దొరను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అతడు పలువురు వ్యక్తుల నుంచి రూ.65లక్షలు వసూలు చేశాడు. బెర్హమ్ పూర్ సర్దార్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి నుంచి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు విఘ్నేశ్వర్ తనకు రైల్వే శాఖలో పని చేసే సీనియర్ ఉద్యోగులతో పరిచయం ఉందని నమ్మించాడు. వారి ద్వారా రైల్వేలోని పలు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అలా పలువురిని నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.
Also Read: గోకర్ణలోని ప్రమాదకర గుహల్లో రష్యన్ మహిళ, పిల్లలు.. కారణం తెలుసుకుని షాక్ అయిన పోలీసులు..
విఘ్నేశ్వర్ చేతిలో మోసపోయిన బాధితుడు ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి విఘ్నేశ్వర్ తన దగ్గర 16లక్షలు తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. మరో నలుగురు వ్యక్తుల దగ్గర ఇలానే చెప్పి 16 లక్షల చొప్పున వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
వ్యక్తులను నమ్మించేందుకు ఫోర్జరీ చేసిన అడ్మిట్ కార్డులు, నకిలీ పరీక్షలు, మెడికల్ టెస్టులు చేయించాడని తేలింది. ఇవన్నీ జరిగినా.. ఉద్యోగం మాత్రం వచ్చేది కాదని బాధితుడు వాపోయాడు. దీనిపై విఘ్నేశ్వర్ ను సంప్రదించే ప్రయత్నం చేయగా.. అతడు అందుబాటులోకి రాలేదు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విఘ్నేశ్వర్ ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఫోర్జరీ చేసిన పత్రాలు, ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు, ఫోర్జరీ చేసిన రైల్వే పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.
“మేము ఫిర్యాదును అందుకున్నాము. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. అతను బెర్హంపూర్‌లోని ఇద్దరు యువకులకు ఉన్నత స్థాయి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి వారి నుండి రూ. 12 లక్షలు చొప్పున అడిగినట్లు కనుగొన్నాము. విస్తృతమైన సెటప్‌తో బాధితుల దగ్గర నమ్మకాన్ని పొందాడు. ప్రస్తుత దర్యాప్తు ప్రకారం, అతను అనేక మంది బాధితుల నుండి మొత్తం రూ. 65 లక్షలకు పైగా సేకరించాడు” అని బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ తెలిపారు.
పోలీసులు ఈ కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఈ రాకెట్‌తో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఇలాంటి మోసాలు జరిగాయా అనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇలాంటి మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని కోరారు. అలాంటి వారు తారసపడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావనే విషయం తెలుసుకోవాలన్నారు.