ఘోర ప్రమాదం.. కారు రివర్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి, వీడియో వైరల్

కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Viral Video : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కారు రివర్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి చెందింది. డ్రైవింగ్ రాకపోయినా.. కారుని రివర్స్ చేసే ప్రయత్నంలో ఆమె తన ప్రాణాలు పొగొట్టుకుంది. యువతి పేరు శ్వేత. వయసు 23ఏళ్లు. ఆమె తన స్నేహితుడితో కలిసి ఔరంగాబాద్ నుంచి సులిబంజన్ హిల్స్ కు టూర్ కు వచ్చింది. అక్కడ కొలువుదీరిన దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉంది. వారు కారులో అక్కడికి వచ్చారు.

కాగా, శ్వేతకు డ్రైవింగ్ సరిగా రాదు. అయినా, ఆమె డ్రైవింగ్ చేస్తాను అంటూ కారు ఎక్కింది. డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు నడిపే ప్రయత్నం చేసింది. కారు నడుపుతూ రీల్స్ చేసింది. ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తుండగా ఘోరం జరిగిపోయింది. బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్ ను నొక్కింది. అంతే.. కారు వేగంగా వెళ్లి కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో యువతి స్పాట్ లోనే చనిపోయింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. శ్వేత కారు డ్రైవింగ్ చేస్తుండగా ఆమె స్నేహితుడు సూరజ్ రికార్డ్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ లోయ 300 అడుగుల లోతు ఉంది. లోయకు 50 మీటర్ల దూరంలో కారు ఉంది. ముందు కారుని స్లోగా రివర్స్ చేసిన శ్వేత ఆ తర్వాత వేగం పెంచేసింది. దీంతో అప్రమత్తమైన స్నేహితుడు స్లో స్లో అంటూ గట్టిగా కేకలు వేశాడు. క్లచ్ వేయాలని బిగ్గరగా అరిచాడు. కానీ, లాభం లేకపోయింది. కారు లోయలో పడిపోయింది.

శ్వేత కారుని రివర్స్ చేస్తూ లోయలో పడిపోయి మరణించడాన్ని కళ్లారా చూసిన స్నేహితుడు షాక్ కి గురయ్యాడు. ప్రమాదాన్ని ఊహించిన అతడు.. అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పరుగులు తీశాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. వేగంగా కారు వెనక్కి వెళ్లి లోయలో పడిపోయింది. కొండ పైనుంచి లోయలోకి పడిపోవడంతో కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాదానికి సంబంధించి వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తోంది. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. డ్రైవింగ్ రాని వారు కారుని నడిపే ప్రయత్నం అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. రీల్స్ కోసం, వీడియోల కోసం వెళితే ప్రాణాలకే ప్రమాదం అని వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read : ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. జైల్లోనూ నిందితురాలు డ్రామాలు

 

ట్రెండింగ్ వార్తలు