తిరుపతి జూ పార్క్‌లో దారుణం.. సందర్శకుడిని చంపేసిన సింహం

సింహాలు ఉండే ఎన్ క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో ఆ వ్యక్తిని సింహం చంపేసింది.

Tirupati Zoo Park Lion Incident

Tirupati Zoo Park : తిరుపతి జూ పార్క్ లో దారుణం జరిగింది. జూ పార్క్ లోని సింహం ఓ సందర్శకుడిని చంపేసింది. సింహాలు ఉండే ఎన్ క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో ఆ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది దొంగల పూర్ అనే మగ సింహం.

సందర్శకుడిని సింహం మట్టుబెట్టిన ఘటన జూ పార్క్ సందర్శకులను, సిబ్బందిని షాక్ కి గురి చేసింది. ఈ విషయం తెలిసి జూ పార్క్ కు వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై జూ పార్క్ అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సింహాలు ఉండే ఎన్ క్లోజర్ కి దూకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్యహత్య చేసుకునేందుకు అలా దూకాడా? లేక మతిస్థిమితం కోల్పోయాడా? అన్నది తెలియాల్సి ఉంది.

తిరుపతి జూ పార్క్ ఆసియాలోనే అతిపెద్దది. సందర్శకుడిని సింహం చంపిన ఘటన తిరుపతి జూ పార్క్ చరిత్రలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. దాదాపు 10 నుంచి 15 సింహాలు తిరుపతి జూ పార్కులో ఉన్నాయి. అలాగే పులులు కూడా ఉన్నాయి.

* తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో దారుణం
* లయన్ ఎన్ క్లోజర్ లోకి దూకేసిన సందర్శకుడు
* దొంగల పూర్ అనే మగ సింహం ఆ వ్యక్తిని నోట కరిచింది
* ఒంటిపై ఉన్న ప్యాంటు షర్టును లాగేసి మెడ బాగాన కరిచింది
* మృతుని పేరు గుర్జాల ప్రహ్లాద
* లయన్ కేజ్ లో ఉన్నటువంటి గేటును దాటి లోనికి వెళ్లి సింహాలకు ఆహారాన్ని వేసే ప్రాంతం నుంచి సింహం ఉన్న బోనులోకి దూకాడు
* ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సందర్శకులకు అనుగుణంగా సింహాలను ఉంచుతారు

వ్యక్తి మృతదేహం ఇంకా సింహాల ఎన్ క్లోజర్ లోనే ఉంది. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సమయం కావడంతో తక్కువ సంఖ్యలోనే సందర్శకులు ఉన్నారు. ఎవరూ లేనప్పుడే ఈ సంఘటన జరిగిందని, సింహాలకు సిబ్బంది ఆహారం అందించి అక్కడి నుంచి వెళ్లిన తర్వాతే ఆ ఎన్ క్లోజర్ లోకి దూకినట్లు తెలుస్తోంది. అర కిలోమీటర్ మేర విస్తరించిన ఎన్ క్లోజర్ లోకి ఆ వ్యక్తి ఎలా వెళ్లగలిగాడు అనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక సింహాల ఎన్ క్లోజర్ లోకి వెళ్లే ద్వారా సరిగా లేకపోవడంతోనే ఆ వ్యక్తి సులువుగా అందులోకి దూకగలిగాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు