ఉత్తర ప్రదేశ్ లో మహిళల పై జరుగుతున్నరేప్ కేసులు, హత్యల కేసులు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచార కేసులు విచారించేందుకు 218 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేసిన తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర ప్రజలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైఒత్తిడి చేస్తున్నారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని యూపీ సర్కార్‌పై ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు, వేధింపుల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 218 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంట్లో 144 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులేమో మహిళలపై అత్యాచార కేసులకు, మిగతా 74 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులేమో చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు త్వరితగతిన విచారించి శిక్ష విధించనున్నాయి.
ఈ కోర్టుల కోసం 218 మంది అడిషనల్ సెషన్స్ జడ్జిలను నియమిస్తున్నారు. అవసరమైన సిబ్బందిని సంబంధిత కోర్టులు నియామకం చేసుకుంటాయని మంత్రి వివరించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేయడంతో సీఎం యోగి.. నిందితులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.