శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 09:41 AM IST
శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

Updated On : April 29, 2020 / 9:41 AM IST

మహారాష్ట్రలోని పాల్ ఘర్ వద్ద ఇద్దరు సాధువులపై దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే ఊత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురైన ఘటన  కలకలం రేపుతోంది.

ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్  జిల్లాలో ఇద్దరు సాధువుల మృతదేహాలను మంగళవారం, ఏప్రిల్ 28 ఉదయం కనుగొన్నారు. గుర్తు తెలియని దుండగులు వీరిని హత్య చేశారు. వీరిని 55 ఏళ్ల జగదీష్, అలియాస్ రంగిదాస్, 45 ఏళ్ళ షేర్ సింగ్, అలియాస్ శివదాస్ గా గుర్తించారు. జిల్లాలోని  అనూప్ షహర్ పోలీసు స్టేషన్  పరిధిలోని  పగోనా గ్రామంలోని శివాలయంలో  వీరిద్దరూ అర్చకులుగా పనిచేస్తూ ఆలయ పరిసరాల్లోనే నివసిస్తున్నారు.  

నిందితులు వీరిని హత్య చేయటానికి పదునైన ఆయుధాలు వాడినట్లు పోలీసులు తెలిపారు. వీరి హత్యకు సంబంధించి సమీప గ్రామానికి చెందిన మురళి, అలియాస్ రాజు అనే వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రెండు రోజుల క్రితం రాజుకు, అర్చకులకు మధ్య  ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.  ఆ కక్షతోనే రాజు మత్తు మందు ఉపయోగించి పదునైన ఆయుధంతో వారిని హతమార్చినట్లు సమాచారం.
 
మంగళవారం ఉదయం రాజు చేతిలో కత్తిపట్టుకుని వెళ్ళటాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు చూశారు.  రాజు ను అరెస్టు చేసినప్పుడు అతను స్పృహలో లేడని పోలీసులు తెలిపారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మొహరించారు.  మరో వైపు ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాధ్   లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.