Warangal Girls Case : స్నేహం పేరుతో దగ్గరై డ్రగ్స్ అలవాటు చేసి బాలికలపై అఘాయిత్యాలు- వరంగల్ కిలాడీ లేడీ కేసులో సంచలనం
అమాయకపు బాలికలు టార్గెట్ గా ఈ ముఠా కార్యకలాపాలు సాగించింది.

Warangal Girls Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కిలాడీ లేడీ కేసులో విచారణ కొలిక్కి వచ్చింది. 19ఏళ్ల కిలాడీ లేడీ నుంచి కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. నాలుగు రోజుల్లో పలు కోణాల్లో విచారణ పూర్తి చేశారు. కిలాడీ లేడీ కేసులో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడి నివాసం నుంచి మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకుననారు. అమాయకపు బాలికలు టార్గెట్ గా ఈ ముఠా కార్యకలాపాలు సాగించింది.
స్నేహం ముసుగులో బాలికలకు దగ్గరైన కిలాడీ లేడీ.. ఆ తర్వాత వారిని ముగ్గులోకి లాగింది. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది. ఆపై అఘాయిత్యాలు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. కిలాడీ లేడీ ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. కిలాడీ లేడీతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కిలాడీ లేడీ కొంతమందితో ముఠాగా ఏర్పడి చీకటి బాగోతానికి పాల్పడినట్లు వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. కిలాడీ లేడీ హనుమకొండ జిల్లా దామెర మండలంలోని గ్రామ వాసి. వరంగల్ మిల్స్ కాలనీ సమీపంలో నివాసం ఉంటోంది. గంజాయి, మత్తు పదార్థాలకు బానిసగా మారింది. తనతోపాటు డ్రగ్స్ కు అలవాటు పడిన మరో అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ముఠాగా ఏర్పడింది.
Also Read : వామ్మో.. హైదరాబాద్‌లో రద్దయిన పాత నోట్ల కలకలం.. రూ.55లక్షల విలువైన కరెన్సీ నోట్లు స్వాధీనం..
ఈ ముఠా.. స్కూల్ పిల్లలను టార్గెట్ చేసుకుంది. అమాయక బాలికలను ఎంచుకుని స్కూల్ కి వెళ్లి వచ్చే సమయంలో వారితో మాటలు కలిపేది. స్నేహం పేరుతో వారికి దగ్గరయ్యేది. ఆ తర్వాత బాలికలకు గంజాయి చాక్లెట్లు, మత్తు పదార్థాలు అలవాటు చేసేది. ఆ తర్వాత వారిని కిడ్నాప్ చేసి అప్పటికే తన ముఠాకు టచ్ లో ఉన్న కస్టమర్లకు అప్పగించేది. అలా వారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారు.
బాలికలు స్పృహలోకి వచ్చాక వారిని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో.. తిరిగి అక్కడే వదిలేసేది. ఇలా ఆ కిలాడీ లేడీ తన గ్యాంగ్ తో ఏడాదిన్నరగా బాలికలను ట్రాప్ చేసి, చీకటి దందా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వరంగల్ లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ స్కూల్స్ దగ్గర కిలాడీ లేడీ రెక్కీ నిర్వహించేదని పోలీసుల విచారణలో తేలింది.
అనూహ్యంగా ఓ బాలిక కిడ్నాప్ కావడం, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడీ లేడీ బాగోతం బట్టబయలైంది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక రెండు రోజుల కిందట కనిపించకుండా పోయింది. రెండు రోజుల తర్వాత బాలికి ఇంటికి చేరుకుంది. అయితే, బాలిక మగతగా ఉండటంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు.
ఓ మహిళ తనను కిడ్నాప్ చేసిందని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదంది. స్పృహలోకి వచ్చాక తనను వదిలేసి వెళ్లిందని చెప్పింది. వెంటనే బాలిక పేరెంట్స్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. సంచలన నిజం బయటపడింది. కిలాడీ లేడీ చీకటి బాగోతం బట్టబయలైంది.