సల్మాన్ ఖాన్‌తో స్నేహమే సిద్ధిఖీ ప్రాణం తీసిందా? అసలు బాలీవుడ్ స్టార్‌తో బిష్ణోయ్ గ్యాంగ్ శత్రుత్వం ఎందుకు?
బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలు ఇప్పుడు ముంబైలో కొత్త భయాన్ని సృష్టిస్తున్నాయి.

Salman Khan Vs Lawrence Bishnoi Gang (Photo Credit : Google)
Salman Khan Vs Lawrence Bishnoi Gang : ప్రశాంతమైన సాయంత్రం.. సిటీ అంతా పండగ వాతావరణం. టపాసుల ధ్వనుల మధ్య తూటా ధ్వని కలిసిపోయింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసింది. ఎన్సీపీ కీలక నేత బాబా సిద్ధిఖీ హత్యతో ముంబై మహానగరం ఉలిక్కి పడింది. హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అసలు ఈ గ్యాంగ్ సిద్ధిఖీని ఎందుకు చంపింది? సల్మాన్ తో దోస్తీనే ఆయన ప్రాణం తీసిందా? పోలీసుల విచారణలో బయటపడ్డ ఉలిక్కిపడే నిజాలేంటి?
అప్పుడు దావూద్.. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్.. ఇద్దరికీ తెలిసింది నేరాలే. మాఫియాను విస్తరించడంలో ఇద్దరి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. పంజాబ్ కు మాత్రమే పరిమితమైన బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు సగం ప్రపంచానికి పాకింది. దేశాన్ని భయపెడుతోంది. ఇంతకీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఏంటి? దావూద్ ఇబ్రహీంకు సాయం చేస్త లేపేస్తామని ఎందుకు వార్నింగ్ ఇస్తోంది? అసలు సల్మాన్ ఖాన్ తో ఈ గ్యాంగ్ శత్రుత్వం ఏంటి?
సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ చాలా ఏళ్లుగా వెంటాడుతోంది. సల్మాన్ కదలికలపై ఓ కన్నేస్తూ ఎప్పటికప్పుడు రెక్కీ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ముంబైలోని సల్మాన్ ఇంటికి బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. వార్నింగ్ ఇచ్చి మరీ సల్మాన్ మీద ఫైరింగ్ చేశారు. ఇప్పుడు సిద్ధిఖీ హత్యకు తామే బాధ్యులం అని ప్రకటించిన బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ను వదిలేది లేదని తెగేసి చెప్పింది. దీంతో అతడికి భద్రతను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయి.
బిష్ణోయ్ కమ్యూనిటీ ఎంతో పవిత్రంగా భావించే దుప్పిని చంపి సల్మాన్ ఖాన్ తమ సామాజికవర్గాన్ని అవమానించారని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో లారెన్స్ బిష్ణోయ్ మీడియా సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి టార్గెట్ సల్మాన్ ఆపరేషన్ ను మరింత స్ట్రాంగ్ చేసింది ఆ గ్యాంగ్. ఇప్పుడు ఏకంగా ఓ ప్రాణం తీసింది. బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు ఇప్పుడు ముంబైలో కొత్త భయాన్ని సృష్టిస్తున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ మరో దావూద్ మాఫియాగా మారబోతోందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
Also Read : ఎవరీ బాబా సిద్ధిఖీ.. ఆయనకు అంత గుర్తింపు ఎలా వచ్చింది?