Woman Falls Off Moving Train While Fighting Off Thiefdies
Local Train : తన మొబైల్ ఫోన్ లాక్కోటానికి ప్రయత్నించిన దొంగతో పోరాడుతూ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని కల్వా-ముంబ్రా స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డోంబివ్లి లో నివసించే విద్యాపాటిల్ (35) అనే మహిళ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుర్లా స్టేషన్ లో లోకల్ రైలు ఎక్కారు. ఆమె రైలులో తలుపు దగ్గరగా ఉన్న ఒక సీటులో కూర్చున్నారు.
ఫైసల్ షేక్ అనే వ్యక్తి రాత్రి గం.7-15లకు కల్వా స్టేషన్ లో రైలు ఎక్కాడు. రైలు తిరిగి బయలుదేరే సమయంలో అతను విద్యా ఫోన్ లాక్కోని, రైలు దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ విద్యా అతడ్ని ప్రతిఘటించింది. నిందితుడ్ని గట్టిగా పట్టుకుంది. రైలు వేగం పెరిగినా నిందితుడు రైలు దూకి పారిపోటానికి ప్రయత్నించాడు.
ఈక్రమంలో నిందితుడు ఆమెను నెట్టివేయటంతో కంపార్ట్‌మెంట్‌లో నుంచి రైలు కింద పడిపోయింది. ఆమెను రక్షించేందుకు రైలులోని ప్రయాణికులు గోలుసు లాగి రైలును నిలిపి వేశారు. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదు. లోకో పైలట్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ పుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ముంబైకి చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.