ఏంటీ దుస్థితి : ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఏ, బీకాం

ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఏ కోర్సులకు అనుమతి

  • Published By: chvmurthy ,Published On : January 7, 2019 / 05:20 AM IST
ఏంటీ దుస్థితి : ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఏ, బీకాం

ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఏ కోర్సులకు అనుమతి

హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్ధులు చేరక, మూసివేతకు సిధ్దంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇక నుంచి బీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ లాంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతినిచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణాల్లో వీటిని నిర్వహించుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని 2019-20 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసుకోవచ్చని అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ లో తెలిపింది. కాకపోతే ఇందుకోసం ప్రత్యేక భవనాలు, నిర్వహణ వ్యవస్ధ ఉండాలని, ఇంజనీరింగ్ కాలేజీలతో సంబంధం లేకుండా వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. వీటి అనుమతి కోసం స్ధానిక యూనివర్సిటీలు, బోర్డులను సంప్రదించాలని సూచించింది.
అనుమతులు తప్పని సరి
డీమ్డ్‌ యూనివర్సిటీలకు, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ, ఎంసీఏ, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా సర్టిఫికెట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులకు ఏఐసీటీ ఈ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ఇప్పటి వరకు అనుమతి లేకపోతే  కొత్త కాలేజీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కూడా  ఏఐసీటీఈ పేర్కోంది.
కొత్త కాలేజీలకు ఆహ్వానం
ఇంజనీరింగ్ తోపాటు  సాంకేతిక  కోర్సులలో శిక్షణ ఇవ్వటానికి  కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకుంనేందుకు ఏఐసీటీఈ దరఖాస్తులు కోరుతోంది. 2019-20 విద్యాసంవత్సరానికి జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పటికే కొనసాగుతున్న కాలేజీలు రెన్యువల్ కోసందరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ సూచించింది.