నో బ్యాగ్ డే : విద్యార్ధులకు హ్యాపీ Saturday

  • Published By: veegamteam ,Published On : February 21, 2020 / 06:08 AM IST
నో బ్యాగ్ డే : విద్యార్ధులకు హ్యాపీ Saturday

Updated On : February 21, 2020 / 6:08 AM IST

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం (ఫిబ్రవరి 20, 2019)న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇక నుంచి ప్రతి శనివారం ప్రభుత్వ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు. వారంలో ఒక రోజు అయినా చిన్నారులకు పుస్తకాలు మోసే బరువును తగ్గించాలని ఆయన తెలిపారు.

ఆ రోజుంతా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, స్కౌట్, పర్సనాల్టీ డెవలప్‌మెంట్ వంటి వేరే కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఇక్కడో మెలిక కూడా ఉంది. ప్రతి శనివారం పిల్లల ఆటలతో పాటుగా పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంటుంది. మీటింగ్ లో తల్లిదండ్రులు, టీచర్లూ కలిసి పిల్లల చదువులు, వాళ్ళకు వచ్చే మార్కుల గురించి చర్చించుకోవాలి. 

ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు స్పందిస్తున్నారు. స్కూల్ బ్యాగుల్ని శనివారం రద్దు చేయడం బాగానే ఉంది. కానీ టీచర్లతో మీటింగ్ ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రతి శనివారం సెలవులు ఉండవనీ… తాము స్కూళ్లకు ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం మాత్రం వీలు చూసుకొని సెట్ చేసుకొని రావాలంటోంది.

అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రసంగం చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచాలనీ కోరారు. ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఏం చెయ్యాలో శనివారం విద్యార్థులకు నేర్పాలన్నారు. విద్యార్థుల కోసమే నిద్రాహారాలు మాని పనిచేస్తున్న తల్లిదండ్రులు… ఆ విద్యార్థులు ఎలా చదువుతున్నదీ, వాళ్లు ఎలాంటి మార్గంలో నడుస్తున్నదీ ప్రతీ శనివారమూ తెలుసుకుంటే మంచిదని తెలిపారు.