ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. దక్షిణ-మధ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అల్పపీడన ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.