కోలుకున్న ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరిలో మానసిక సమస్యలు

  • Published By: sreehari ,Published On : November 10, 2020 / 07:29 PM IST
కోలుకున్న ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరిలో మానసిక సమస్యలు

Updated On : November 10, 2020 / 8:01 PM IST

COVID-19 patients mental illness : కరోనా నుంచి కోలుకున్న వారిలో 90 రోజుల్లోనే మానసికపరమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంట.. ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరిలో ఇలాంటి మానసిక సమస్యలు అభివృద్ధి చెందుతున్నాయని సైకాలిజిస్టులు అంటున్నారు.



కరోనా సోకి కోలుకున్నాక 20 శాతం మందిలో మూడు నెలల వ్యవధిలోనే మానసిక సంబంధిత సమస్యలు మొదలయ్యాయని గుర్తించినట్టు పరిశోధక బృందం వెల్లడించింది.

కోలుకున్న కరోనా పేషెంట్లలో ఆందోళన, ఒత్తిడితోపాటు నిద్రలేమి వంటి సాధారణ మానసిక లక్షణాలు కనిపించాయని రీసెర్చర్లు గుర్తించారు. అంతేకాదు.. ఇలాంటివారిలో హైరిస్క్ అధికంగా ఉంటుందని, మతిమరుపుతో పాటు మెదడు పనితీరులో అనేక మార్పులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.



మానసిక ఆరోగ్య సమస్యలే అతిపెద్ద ముప్పుగా గుర్తించామని బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ పాల్ హరిసన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత తలెత్తే మానసిక అనారోగ్య సమస్యలకు గల కారణాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని వైద్యులు, సైంటిస్టులు అంటున్నారు. The Lancet Psychiatry journalలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.



అమెరికాలో 69 మిలియన్ల మంది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను విశ్లేషించారు. అందులో 62వేలకు పైగా కరోనా బాధితుల డేటా కూడా ఉంది. కరోనా సోకి కోలుకున్న ఐదుగురిలో మూడు నెలల వ్యవధిలో మొదటిసారి ఈ లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.



ఆందోళన, ఒత్తిడి లేదా మతిమరుపు వంటి మానసిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అదే కాలంలో ఇతర గ్రూపు పేషెంట్లలో కూడా రెండుమార్లు ఇలాంటి సమస్యలు తలెత్తినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇదివరకే మానసిక అనారోగ్య సమస్యలు లేనివారి కంటే.. ఉన్నవారే 65శాతం ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది.