tata institute claims its rs 100 tablet can prevent cancer recurrence
Tata Cancer Tablet : క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ఒకసారి శరీరంలో వచ్చిందంటే.. అది మెల్లగా అన్ని భాగాలకు వ్యాపించి క్యాన్సర్ కణాలుగా మార్చేస్తుంది. ఫలితంగా శరీరంలోని కణాలను క్షీణించిపోయి చివరికి మరణానికి దారితీస్తుంది. ఇలాంటి ప్రాణాంతకమైన క్యాన్సర్ నివారణ కోసం అద్భుతమైన మెడిసిన్ కనిపెట్టింది. ముంబైకి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ క్యాన్సర్ తమ పరిశోధనలో విజయం సాధించింది. క్యాన్సర్ నివారణకు ఒక ట్యాబ్లెట్ తయారు చేసింది.
Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !
ఈ ట్యాబ్లెట్ ద్వారా క్యాన్సర్ బాధితులను ప్రాణాలను నిలబెట్టడంలో సాయపడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ ట్యాబ్లెట్.. క్యాన్సర్ బారిన పడిన తర్వాత కోలుకున్న వారిలో రెండోసారి క్యాన్సర్ రాకుండా నిరోధించగలదు. ఈ మేరకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్యాన్సర్ మందును కనిపెట్టేందుకు 10ఏళ్ల పాటు పరిశోధనల అనంతరం విజయం సాధించింది. క్యాన్సర్ అడ్డుకోవడమే కాకుండా రేడియేషన్, కీమోథెరపీలో తలెత్తే దుష్ప్రభావాలను కూడా భారీగా తగ్గిస్తుందని టాటా ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు వెల్లడించారు.
ఎలుకలపై ప్రయోగం సక్సెస్ :
అసలు ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు మానవుల్లోని క్యాన్సర్ కణాలను ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. తద్వారా ఎలుకల్లో అది క్యాన్సర్ కణాలుగా మారింది. ఆ వెంటనే క్యాన్సర్ బాధిత ఎలుకలకు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి సర్జరీలు చేశారు. క్యాన్సర్ కణాలు క్షీణించగా క్రొమాటిన్ పార్టికల్స్ అనే అతి సూక్ష్మకణాలుగా విడిపోయినట్టుగా గుర్తించారు. ఈ పార్టికల్స్ రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు పాకుతాయి. తద్వారా ఆరోగ్యవంతమైన కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెందుతాయని టాటా మెమోరియల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ రాజేంద్ర బడ్వే తెలిపారు.
క్యాన్సర్ కణాలు క్షీణించినప్పుడు కణ రహిత క్రొమాటిన్ పార్టికల్స్ (cfChPs) క్రోమోజోమ్‌ల ఫ్రాగ్మెంట్స్ విడుదల చేస్తాయి. ప్రత్యేకించి రేడియేషన్, కీమోథెరపీ లాంటి చికిత్సల సమయంలో ఇలా జరుగుతుంది. దాంతో శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు సైతం క్యాన్సర్ కారకంగా మారిపోతాయి. క్రొమాటిన్ పార్టికల్స్ అనేవి హెల్తీ క్రోమోజోమ్‌లతో కలిసి కొత్త క్యాన్సర్లకు దారితీస్తాయని పరిశోధనలో తేలిందని టాటా మెమోరియల్ సెంటర్ పేర్కొంది. ఈ క్యాన్సర్ వ్యాధికి మందు కనుగొనేందుకు పరిశోధకులు రిజ్వెరట్రాల్ అండ్ కాపర్ (R+Cu)తో కూడిన ప్రో ఆక్సిడెంట్ అనే ట్యాబ్లెట్లను ఎలుకల్లో ప్రయోగించారు.
రెండోసారి క్యాన్సర్‌ను 30శాతం నివారించగలదు :
ఈ మెడిసిన్ క్రొమాటిన్ పార్టికల్స్‌ను నాశనం చేయగల ఆక్సిజన్ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. నోటి ద్వారా రిజ్వెరట్రాల్ అండ్ కాపర్ తీసుకున్న తర్వాత కడుపులోకి చేరి ఆక్సిజన్ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అనంతరం రక్తంలోకి కలుస్తాయి. ఈ రాడికల్స్ క్రొమాటిన్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవు. క్యాన్సర్ కణాలను శరీరంలో ఇతర భాగాలకు వ్యాప్తిచెందకుండా ఈ ఆక్సిజన్ రాడికల్స్ అడ్డుకుంటాయి. కీమోథెరపీ టాక్సిసిటీను సైతం అడ్డుకుంటాయని సైంటిస్టులు వెల్లడించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు తయారుచేసిన ఈ ట్యాబ్లెట్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ దుష్ప్రభావాలను 50 శాతం వరకు తగ్గించడంలో సాయపడుతుంది. రెండోసారి క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 30 శాతానికిపైగా నివారించగలదు. పాంక్రియాస్, లంగ్స్, ఓరల్ క్యాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధులపైనా కూడా ఈ ట్యాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
సెల్-ఫ్రీ క్రోమాటిన్ కణాలు అంటే ఏంటి? :
కణ రహిత క్రోమాటిన్ కణాలు క్రోమాటిన్ అనే అతి సూక్ష్మ కణాలుగా విడిపోతాయి. డీఎన్ఏ, ప్రోటీన్ల సముదాయాన్ని కలిగి ఉంటాయి. క్రోమోజోమ్‌లను తయారు చేసుకుంటాయి. రక్తం లేదా మూత్రం వంటి ద్రవాలలో కణాల వెలుపల కనిపిస్తాయి. కణాలు క్షీణించిన సమయంలో అపోప్టోసిస్ లేదా నెక్రోసిస్‌తో సహా వివిధ సెల్యులార్ ప్రక్రియల ద్వారా ఈ కణాలు రక్తప్రసరణలోకి విడుదల అవుతాయి. రోగనిరోధక కణాల నుంచి కూడా ఉద్భవించవచ్చు. కణ రహిత క్రోమాటిన్ కణాలు జన్యు పదార్ధం, అనుబంధ ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి. శరీర ద్రవాలలో క్యాన్సర్, స్వయం ప్రతిరక్షక రుగ్మతలు, తాపజనక పరిస్థితులతో సహా వివిధ వ్యాధులకు బయోమార్కర్‌లుగా ఉపయోగపడతాయి.
ఈ టాబ్లెట్ ప్రజలకు అందుబాటులోకి ఎప్పుడంటే? :
టాటా ఇన్‌స్టిట్యూట్ వైద్యులు దాదాపు ఒక దశాబ్దంగా ఈ టాబ్లెట్‌పై పనిచేస్తున్నారు. ట్యాబ్లెట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆమోదించాల్సి ఉంది. (TIFR) శాస్త్రవేత్తలు ఈ టాబ్లెట్‌ను ఆమోదించడానికి (FSSAI)కి దరఖాస్తు చేసుకున్నారు. ఆమోదం పొందిన తర్వాత.. వచ్చే జూన్-జూలై నుంచి మార్కెట్‌లో రూ. 100 ధరలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడంలో ఈ టాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుందని సీనియర్ క్యాన్సర్ సర్జన్ రాజేంద్ర బడ్వే పేర్కొన్నారు.
Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!