Donate Blood : రక్తదానం చేయాలనుకునేవారు నివారించాల్సిన తప్పులు ఇవే!
ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నా, దంతాలు తొలగించుకున్నా, చెవి , శరీర ఆపరేషన్లు, పచ్చబొట్లు పొడిపించుకోవడం వంటివి ఉంటే అలాంటి వారు ఆరు నెలల పాటు రక్తదానం చేయడానికి అర్హులు కాదు. రక్తదానం చేసే ముందు ఎలాంటి అతృత, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది.

donate blood
Donate Blood : అత్యవసర సందర్భాల్లో చాలా మందికి రక్తం అవసరత ఏర్పడుతుంది. ఆసందర్బంలో స్నేహితులనో, కుటుంబ సభ్యులో లేకుంటే బ్లడ్ బ్యాంకుల నుండో రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందిస్తుంటారు. అయితే రక్త దానం చేసే విషయంలో చాలా మందిలో అపోహలు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకురారు. మరికొంత మంది రక్తదానం చేయాలంటే ఆందోళన, బయపడటం వంటివాటికి లోనవుతుంటారు. ఇకొంతమంది రక్త దానం చేయటం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని, నొప్పి కలుగుతుందన్న కారణాలతో ఆసక్తి చూపరు. వాస్తవానికి రక్తదానం సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే రక్తదానం చేయాలనుకునేవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. కొన్ని తప్పులను చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తాన్ని దానంగా ఇవ్వాలనుకునే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య వంతుడు అయి ఉండాలి. దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్స తీసుకునేవారు రక్తదానం చేయకూడదు. రక్తం ఇచ్చే ముందు రోజు రాత్రి నిద్రలేమితో ఉండకూడదు. రక్తదానం చేయటానికి ముందు 4 గంటల్లో ఆహారం తీసుకుని ఉండాలి. ముందురోజు రాత్రి 6 లేదా అంతకంటే ఎక్కువ గంటలు బాగా నిద్రపోయి ఉండాలి. రక్తదానం చేసే 2 గంటల ముందు పొగ తాగకుండా ఉండాలి. 12 గంటల వ్యవధికి ముందు మద్యం సేవించకుండా ఉండాలి.
రక్తాన్ని దానంగా ఇచ్చేవారు పూర్తి వివరాలను ముందుగా అందించాలి. శరీర ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా ఆవివరాలను తెలిజేయటం మంచిది. రక్తదానం చేసేవారు రక్తాన్ని ఇవ్వటానికి ముందు తగినంత నీరు తీసుకోవాలి. నిపుణులు సూచిస్తున్న ప్రకారం రక్తాన్ని ఇచ్చేవారు రెండు నుండి మూడు గ్లాసుల నీరు తీసుకోవటం మంచిది. హైపర్‌టెన్షన్ లేదా బ్లడ్ షుగర్ కోసం మందులు తీసుకుంటున్న వ్యక్తులు వాటి స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లయితే దానం చేయడానికి అర్హులు. గత ఏడాదిలో ఏదైనా టీకా తీసుకున్నట్లయితే,రక్తదానం చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.
ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నా, దంతాలు తొలగించుకున్నా, చెవి , శరీర ఆపరేషన్లు, పచ్చబొట్లు పొడిపించుకోవడం వంటివి ఉంటే అలాంటి వారు ఆరు నెలల పాటు రక్తదానం చేయడానికి అర్హులు కాదు. రక్తదానం చేసే ముందు ఎలాంటి అతృత, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. కండరాలు సడలించి, రక్తాన్నిచూసి బయపడకుండా హాయిగా పడుకోవాలి. రక్తదానం తరువాత విశ్రాంతి తీసుకోవటం మంచిది. చాలా మంది రక్తదానం తరువాత తమపనుల్లో నిమగ్నమై ఎక్కువ శారీరక శ్రమ చేయటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిదికాదు. తగిన విశ్రాంతి తీసుకోవటం వల్ల రక్త ప్రవాహం సాధారణంగా మారుతుంది. రక్తదానం తరువాత జ్యూస్ లు వంటివి తీసుకోవటం, బిస్కెట్లు వంటివి తినటం వల్ల శరీరం తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. రక్తదానం ద్వారా కోల్పోయిన చక్కెరలను పెంచటంలో ఇవి సహాయపడతాయి.
కాబట్టి రక్తదానం విషయంలో అపోహలు వీడి తగిన జాగ్రత్తలు పాటిస్తూ రక్తదానం చేయటం వల్ల ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించటం ద్వారా వారి ప్రాణాలు నిలిపినవారవుతారు.