వణికిస్తున్న వైరల్ జ్వరాలు

చలి తగ్గుతోంది గానీ జ్వరాల సీజన్ మాత్రం ఇంకా మారలేదు. హాస్పిటల్స్ అన్నీ ఇంకా జ్వరాల పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 09:55 PM IST
వణికిస్తున్న వైరల్ జ్వరాలు

Updated On : February 2, 2019 / 9:55 PM IST

చలి తగ్గుతోంది గానీ జ్వరాల సీజన్ మాత్రం ఇంకా మారలేదు. హాస్పిటల్స్ అన్నీ ఇంకా జ్వరాల పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.

చలి తగ్గుతోంది గానీ జ్వరాల సీజన్ మాత్రం ఇంకా మారలేదు. హాస్పిటల్స్ అన్నీ ఇంకా జ్వరాల పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా డెంగ్యూ, చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్లే కనిపిస్తున్నాయి. మా ఇంట్లో కూడా ఇదే సమస్య. వరుసబెట్టి అందరూ తుమ్ములు, దగ్గులు, జ్వరాలు. మనకు తెలిసింది ముఖ్యంగా మూడే సీజన్లు. ఇప్పుడు జ్వరాల సీజన్ కూడా వాటిలో చేరిపోయింది. వైరల్ జ్వరాలు చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తాయనుకుంటాం. కానీ వీటికి చిన్నా పెద్దా తేడా లేదు. అన్ని వయసుల వాళ్లూ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. అయితే చిన్న పిల్లలు, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు వైరల్ జ్వరాల బారిన పడే అవకాశం ఎక్కువ. వైరల్ జ్వరాల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న వ్యాధులు ప్రధానంగా డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చికున్ గున్యా. తట్టు, గవద బిళ్లలు లాంటి వైరల్ ఇన్ ఫెక్షన్లు, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయంటున్నారు డాక్టర్లు.

 
ఏ వైరల్ జ్వరమైనా లక్షణాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కామన్ గా ఉంటాయి. ఇన్ ఫ్లుయెంజా వైరస్ ఇన్ ఫెక్షన్ వల్ల వచ్చే సాధారణ వైరల్ జ్వరం చాలావరకు డాక్టర్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కాని ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లను మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. వైరల్ జ్వరాల్లో కొంచెం ప్రమాదకరమైనవంటే డెంగీ, చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ లాంటివే. అయితే ప్రతి దానికి కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది. మొదలైన రోజు నుంచీ లక్షణాల తీవ్రత ఒకే రకంగా ఉంటుంది. డెంగీ ఉన్నప్పుడు అయిదు రోజుల వరకు జ్వరం 101 నుంచి 105 డిగ్రీల వరకు ఉంటుంది. ఎముకలు విరిగినట్టు నొప్పులుంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. డెంగీ ఉన్నప్పుడు శరీరంపై దద్దుర్లు కూడా రావొచ్చు. దీన్నినిర్ధారించడానికి డెంగీ రాపిడ్ డిటెక్షన్ టెస్టు, యాంటి జెన్ టెస్టు అనే ప్రత్యేక పరీక్షలు కూడా ఉన్నాయి. చికున్ గున్యా ప్రధాన లక్షణం ఒంట్లోని కీళ్లన్నీ నొప్పులుగా ఉండడం. ఈ నొప్పులు 10 రోజుల నుంచి 6 నెలల వరకూ ఉండొచ్చు. 
డెంగీ లక్షణాలు
– 5 రోజుల వరకు జ్వరం
– 101 నుంచి 105 డిగ్రీల వరకు జ్వరం
– శరీరం పై దద్దుర్లు
– ఎముకలు విరిగినట్టు ఒళ్లు నొప్పులు
– ప్లేట్ లెట్ ల సంఖ్య పడిపోవడం
చికున్ గున్యా లక్షణాలు
– కీళ్ల నొప్పులు
– తీవ్రమైన జ్వరం
– నీరసం
– పెయిన్స్ నెల వరకు ఉండొచ్చు. 6 నెలలు కూడా ఉండొచ్చు. కొందరికి పదిరోజులకే తగ్గొచ్చు. 

దోమ కుట్టగానే కొంచెం దురద పెడుతుంది. మహా అంటే ఓ దద్దురు వస్తుంది. అంతేకదా అనుకుంటే పొరపాటు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా లాంటి మహమ్మారి వ్యాధులు వ్యాప్తి చెందేది దోమల ద్వారానే. మలేరియా, డెంగీ రెండూ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులే అయినా అవి వేర్వేరు దోమలు. మలేరియా అనాఫిలస్ దోమ ద్వారా వస్తే డెంగీ ఏడిస్ దోమ వల్ల సంక్రమిస్తుంది. మలేరియా దోమలు మురికి నీటిలో పెరిగితే, డెంగీ దోమలు మంచి నీటి నిల్వల్లో పెరుగుతాయి. మలేరియా దోమ రాత్రి కుడితే, డెంగీ దోమ పగలు కుడుతుంది. అందుకే డెంగీ దోమలతో మరింత జాగ్రత్తగా ఉండాలి. నీటి నిల్వతో కూడిన కుండీలు, ట్యాంకులు మూతలు లేకుండా ఉంచితే డెంగ్యూ దోమలను పెంపుడు జీవులుగా పెంచుకున్నట్టే. 

వైరల్ ఫీవర్స్ – చికిత్సలు
డెంగీ లాంటి వైరల్ జ్వరాలకు నిర్దుష్టమైన చికిత్సలేమీ లేవు. లక్షణాలను తగ్గించే దిశగానే చికిత్స ఇస్తారు. డెంగీ ఉన్నప్పుడు ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. స్వైన్ ఫ్లూ కి మాత్రం మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డెంగీ, స్వైన్ ఫ్లూ వ్యాధులకు చికిత్సలేంటో ఇప్పుడు చూద్దాం. 

డెంగీలో కనిపించే ప్రధానమైన కాంప్లికేషన్ రక్తంలో ప్లేట్ లెట్ కణాల సంఖ్య తగ్గిపోవడం. ఇవి రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు సహాయపడతాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తగ్గినప్పుడు దాత నుంచి సేకరించిన ప్లేట్ లెట్ కణాలను రోగికి ఎక్కిస్తారు. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెంగీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సకాలంలో చికిత్స మొదలుపెడితే ప్రాణాపాయం కలుగకుండా రక్షించవచ్చు. ప్లేట్ లెట్ కణాలు రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతాయి. ఇవి ఒకటిన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్ లెట్ లను ఎక్కించాలి. 

స్వైన్ ఫ్లూ కేసులు కూడా ఈ సీజన్ లో ఎక్కువగా ఉంటాయి. అయితే జలుబు, దగ్గు రాగానే అది స్వైన్ ఫ్లూ అని భయపడాల్సిన అవసరం లేదు. స్వైన్ ఫ్లూ పేషెంట్లు ఉన్న చోటుకి వెళ్లి వచ్చిన తరువాత గొంతు నొప్పితో పాటు ఫ్లూ లక్షణాలు, ఊపిరి తీసుకోలేకపోవడం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, నీరసించి పోవడం వంటి సమస్యలుంటే స్వైన్ ఫ్లూ కావొచ్చని అనుమానించాలి. అయితే స్వైన్ ఫ్లూకి మాత్రం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే వారం రోజుల్లో తగ్గిపోతుంది. టీకాలు వేయించుకుంటే మరింత మంచిది. 
స్వైన్ ఫ్లూ లక్షణాలు
– గొంతునొప్పి, ఫ్లూ
– వాంతులు, విరేచనాలు
– తలనొప్పి, నీరసం
ఈ సీజన్ లో వచ్చే జ్వరాల నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా దోమలను నివారించే ప్రయత్నం చేయాలి. మస్కిటో నెట్స్ వాడడం, ఖాళీ కుండీలు, కొబ్బరి బోండాలు లాంటి వాటిల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడం కూడా అవసరం. దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవడం మరిచిపోవద్దు. షేక్ హ్యాండ్స్ మానేసి మన నమస్కారం పెట్టడం మంచిది. ఎన్ 95 మాస్కులు ధరించడం వల్ల స్వైన్ ఫ్లై నుంచి రక్షణ కలుగుతుంది. 
స్వైన్ ఫ్లూకి హోమియో వైద్యం
హోమియోపతి వైద్య విధానం ప్రకారం ఏ జబ్బయినా రావడానికి కారణం శరీరంలో ఉండే ప్రాణశక్తిలో వచ్చే మార్పులే అంటారు. ఈ ప్రాణ శక్తిలో వచ్చిన డిస్ట్రబెన్సును సరిచేయడం ద్వారా చికిత్స అందిస్తుంది హోమియోపతి. ఏ వ్యాధి అయినా ప్రాణశక్తిలో వచ్చే తేడాలే కారణమనే హోమియోపతి వైరల్ జ్వరాలకు ముఖ్యంగా చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ లాంటి ఎపిడెమిక్స్ కి మంచి మందులిస్తోంది.  

ఈ సీజన్ లో ఎక్కువగా కనిపించే మరో వ్యాధి స్వైన్ ఫ్లూ. హెచ్1 ఎన్1 అనే వైరస్ దీనికి కారణం. ఇది పందుల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వాటితో ఎక్కువగా మసలేవారిలో స్వైన్ ఫ్లూ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి మనిషికి వచ్చిందంటే ఇక వాళ్లు దగ్గినా, తుమ్మినా ఇతరులకు చాలా సులువుగా వ్యాపిస్తుంది. 
అల్లోపతి వైద్య విధానంలో వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తారు. కానీ హోమియోపతిలో లక్షణాలకు కాకుండా పేషెంటు స్వభావాన్ని బట్టి చికిత్స చేస్తారు. స్వైన్ ఫ్లూ కి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయంటున్నారు హోమియో వైద్యులు. ఆర్సెనిక్ ఆల్బ్, ఇన్ ఫ్లుయెంజినమ్ అనే హోమియోపతి మందుల ద్వారా స్వైన్ ఫ్లూ ను అరికట్టవచ్చు. హోమియో మందులు చికిత్సకే కాకుండా వ్యాధి రాకుండా నివారణ కోసం కూడా పనిచేస్తాయి. 
ఇమ్యూనిటీ పెంచే ఆహారం
ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకుంటారు… చాయ్, బిస్కెట్..? లేదా సమోసానా..? వద్దొద్దు. ఇకనుంచీ ఇలాంటి స్నాక్స్ బదులుగా పండ్లు తినండి. వాటిలో నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ ఫలాలను తీసుకోండి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. అదెలాగంటారా.. ఇమ్యూనిటీని పెంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని పెంచే అలాంటి ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

జలుబు, దగ్గు లాంటి ఫ్లూ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారమే కీలకం అవుతుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటే వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తివంతమై ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు రావాలంటే వెరైటీ పదార్థాలను తినాలి. నిమ్మకాయ తీసుకుంటే జలుబు చేస్తుందంటారు. కానీ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో నిమ్మలోని విటమిన్ సిదే  మొదటి స్థానమట. తెల్లరక్తకణాల తయారీకి ఇది తోడ్పడుతుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మ మాత్రమే కాదు సిట్రస్ పదార్థాలైన నారింజ, ఉసిరి కూడా మంచివే. బొప్పాయి పండులో కూడా విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజూ ఏదో రూపంలో విటమిన్ సి ని తీసుకోండి.

జలుబు లాంటి చిన్న చిన్న ఇన్ ఫెక్షన్లు రావొద్దంటే సిట్రస్ ఫలాలు తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆకు కూరలలాంటి కూరగాయల్లో కూడా ఇమ్యూనిటీ పెంచే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. సిట్రస్ ఫలాల్లో కన్నా ఎక్కువ విటమిన్ సి పండుమిరపలో ఉంటుంది. వీటిలో బీటా కెరొటిన్ కూడా ఉంటుంది. బ్రాకోలి, బచ్చలి కూర లాంటి కూరగాయల్లో కూడా విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎ, సి, ఇ విటమిన్లు కూడా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి కూడా ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. జలుబు, జ్వరం ఉన్నప్పుడు సూప్ తాగితే నోటికి బావుంటుంది. చికెన్ సూప్ తాగితే ప్రొటీన్లు కూడా అంది బి విటమిన్లు కూడా లభిస్తాయి.

 మహిళల్ని చిరాకు పెట్టే పీఎంఎస్
మా అమ్మ అప్పుడప్పుడూ ఎక్కువ చిరాగ్గా, కోపంగా, చీటికీ మాటీకీ మాపై అరుస్తూ ఉండేది. అలా ఎందుకు ఉండేదో అప్పట్లో అర్థం అయ్యేది కాదు. కాని ఇప్పుడు తెలుస్తోంది. ప్రతినెల కొద్దిరోజులు అంటే సరిగ్గా నెలసరికి ముందు ఏ కారణం లేకుండానే కోపం వస్తుంది. డిప్రెషన్ గా కూడా అనిపిస్తుంటుంది. ఈ బాధ ప్రతి మహిళకీ ఉండేదే. ఈ సమస్యనే ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు వైద్యులు.

ఇంట్లో కుటుంబ సభ్యుల మంచి చెడ్డలు కనిపెట్టుకుని ఉండే మహిళలకు ఒత్తిడీ ఎక్కువే. ప్రతి నెలా బాధించే నెలసరి అదనం. నెలసరి అంటేనే చిరాకుగా ఉండే రోజులు. నెలసరికి ముందు కూడా కనిపించే చిరాకే పీఎంఎస్. నెలసరికి ముందు శారీరకంగా మార్పులు వస్తాయి. మానసికంగా డిస్ట్రబ్ అవుతారు.  నూటికి 90 మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. 
పీఎంఎస్ అనేది భయపడాల్సిన సమస్యేమీ కాదు. నెలసరికి ముందు హార్మోన్లలో తేడాలు వస్తాయి కాబట్టి ఇది సర్వసాధారణం. మూడ్ స్వింగ్ కి చిన్నపాటి కౌన్సెలింగ్ చాలు. అవసరమైతే విటమిన్ సప్లిమెంట్ల వంటి యాంటి ఆక్సిడెంట్స్ ఇస్తారు. భర్త, కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను విసుక్కోకుండా అర్థం చేసుకోవాలి.

నమ్మకాలు-నిజాలు        గాయమైతే పప్పు మానాలా?
మొన్న నా ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. దెబ్బలు తగిలాయని అవి తగ్గేవరకు ఆంటీ పప్పు పెట్టడం మానేసిందట. తనకేమో పప్పు లేనిదే ముద్ద దిగదు. అవస్థ పడిందనుకోండి. విషయమేంటంటే తను పప్పు తినడం మానేసినా కూడా దెబ్బ తగ్గడానికి చాలారోజులే పట్టింది. అసలు దెబ్బ తగిలితే పప్పు నిజంగానే తినకూడదా?
పప్పు తింటే గాయం మానదనీ, మరింత ఎక్కువ అవుతుందని ఎక్కడా ఆధారాలు లేవు. పైగా పప్పు లాంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలంటారు పోషకాహార నిపుణులు. గాయం వల్ల దెబ్బతిన్న కణజాలాలను ప్రొటీన్లు రిపేర్ చేస్తాయి. ప్రొటీన్ లోపం ఉంటే గాయం త్వరగా మానదు. తగినంత ప్రొటీన్ లేకుంటే కొల్లాజన్ ఏర్పడడం కష్టమవుతుంది. కొత్త కణజాలాలు ఏర్పడడానికి కొల్లాజన్ కావాలి. గాయం అయినప్పుడు గాయం తీవ్రతను బట్టి దాదాపు 100 మి.గ్రా. పైగా ప్రొటీన్ బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి గాయమైనప్పుడు ఎక్కువ ప్రొటీన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం అవసరం. 

గాయం మానే ప్రక్రియపై అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. పోషకాహార ప్రభావం మరింత ఎక్కువ. మంచి పోషకాహారం ముఖ్యంగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గాయం త్వరగా మానుతుందంటున్నారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి చెందిన నిపుణులు. గాయమై పుండు అయినప్పుడు పప్పులు, కోడిగుడ్లు, పాల వంటి ప్రొటీన్లతో పాటు విటమిన్ సి, కాల్షియం కూడా ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే గాయమైనప్పుడు ఎటువంటి భయం లేకుండా హాయిగా పప్పు తినేయండి. 
ఆటలుంటేనే చదువులో టాప్

మన చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి ఆడుకోడానికి ఫ్రెండ్సందరం చేరేవాళ్లం. ఏ గల్లీలో చూసినా బాయ్స్ అందరూ ఏ క్రికెట్ ఆడుతూనో కనిపించేవాళ్లు. మా నాన్నగారి కాలంలో అయితే ఇక ఆటల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ పిల్లలకి చదువు కన్నా ఆటలే ఎక్కువ అని గొణుక్కునేదంట నానమ్మ. ఇప్పుడు పిల్లలను చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్లకు ఆటలే లేవు. క్లాసు రూముల్లో బంధీలై పోతున్నారు. ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు. 

ఇప్పుడు పిల్లలకు చదువు తప్ప మరో ధ్యాస లేదు. ఆరుబయట ఆటలు లేవు. అయితే చదువు లేదంటే మొబైల్ లో వీడియో గేమ్స్. లేదా టీవీ. చెంగుచెంగున గంతులేస్తూ ఆడుకోవాల్సిన వయసులో మొబైల్లో గేమ్స్ కు అతుక్కుపోతున్నారు. అందుకే పిల్లల గ్రహణశక్తి తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఆటలు శారీరక ఆరోగ్యానికే గాక చదువుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ కి చెందిన పరిశోధకులు. 

పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా అంతే ముఖ్యం. శారీరకంగా దృఢంగా ఉండడానికి, ఆరోగ్యం కోసం, ఎదుగుదల కోసం ఆటలు శారీరక వ్యాయామంగా పనిచేస్తాయి. ఇప్పుడు కొత్త పరిశోధన ప్రకారం పిల్లలు చదువులో రాణించాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల ఏకాగ్రత, జ్నాపక శక్తి పెరుగుతాయి. సమస్యను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత మెరుగుపడతాయి. స్కూల్ పిల్లలకు మాత్రమే కాదు.. కాలేజీ విద్యార్థుల్లో కూడా ఇటువంటి ప్రయోజనాలుంటాయి. అందుకే పిల్లల్లో శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడేట్టుగా ప్రోత్సహించాలి.