మౌనిక భర్త కంటతడి : బలవంతంగా మెట్రో ఎక్కించా, నేనే చంపుకున్నా
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తలుచుకుని మౌనిక భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు.

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తలుచుకుని మౌనిక భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు.
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తలుచుకుని మౌనిక భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు. హరికాంత్ చెప్పడంతోనే మౌనిక మెట్రోలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. మెట్రోలో వెళ్లమని తాను బలవంతం చేయడం వల్లే మౌనిక చనిపోయిందని ఆమె భర్త కన్నీటిపర్యంతమవుతున్నారు. మౌనిక సోదరి ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్‌కి వచ్చింది. హాస్టల్లో ఉండి చదువుకుంటానని ఆమె చెప్పడంతో… అమీర్‌పేట్‌లోని ఓ మంచి హాస్టల్‌లో చేర్పించేందుకు మౌనిక బయల్దేరింది.
మౌనిక బస్సులో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా… ఆమె భర్త హరికాంత్ మెట్రోలో తొందరగా అమీర్‌పేట్ వెళ్లి ఇంటికి రావొచ్చని సూచించారు. మెట్రో తనకు అలవాటు లేదని… బస్సులోనే వెళ్తానని చెప్పిన మౌనికను.. హరికాంత్ బలవంతంగా ఒప్పించారు. మెట్రోలో వెళ్తే తక్కువ టైమ్‌లో పని పూర్తి చేసుకొని రావొచ్చని చెప్పారు. దీంతో తన సోదరితో కలిసి మౌనిక మెట్రోలో ప్రయాణించింది. స్వయంగా హరికాంత్.. వారిద్దరిని కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కించారు.
హరికాంత్ ఇంటికి తిరిగి వెళ్లిన 10 నిమిషాలకే మౌనిక సోదరి అతడికి ఫోన్ చేసింది. మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడిపటడంతో మౌనిక తీవ్రంగా గాయపడిందని తెలిపింది. దీంతో వెంటనే హరికాంత్ అమీర్‌పేట్ చేరుకున్నారు. కానీ.. మౌనిక అప్పటికే మృతిచెందింది. తాను బలవంతంగా మెట్రోలో పంపడం వల్లే మౌనిక మృతి చెందిందని హరికాంత్ రోదిస్తున్నారు.
ఏడాది క్రితం మంచిర్యాలకు చెందిన హరికాంత్ రెడ్డితో కరీంనగర్‌కు చెందిన మౌనికతో వివాహం జరిగింది. హరికాంత్ హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. తన సమీప బంధువు వరుసకు చెల్లెలైన నిఖిత బీటెక్ చదువుతోంది. ఆమెకు అమీర్‌పేట్‌లో హాస్టల్ వసతి చూడటానికి మెట్రో రైల్ లో ఇద్దరూ వచ్చారు. అనుకోకుండా మెట్రో స్టేషన్ లో పిల్లర్ పెచ్చులు విరిగి పడటంతో మౌనిక మృతి చెందింది.
మెట్రో అధికారుల నిర్లక్ష్యం..నిర్మాణంలో నాణ్యత లోపం తన భార్య మృతికి కారణమని కన్నీటి పర్యంతమయ్యాడు హరికాంత్ రెడ్డి. శరవేగంగా సాగుతున్న మెట్రో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు.
మౌనిక మృతిపై ఆమె కుటుంబసభ్యులతో ఎల్అండ్‌టీ అధికారులు చర్చలు జరిపారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేయగా.. రూ.20 లక్షలు, రూ.10 నుంచి 15 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు ఇచ్చేందుకు ఎల్‌అండ్‌టీ అధికారులు అంగీకరించారు. అలాగే మౌనిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించారు.