కాల్ సెంటర్ దందా : అప్పు ఇస్తాం అంటూ కోట్లు కొట్టేశారు

హైదరాబాద్ : దోపిడీకి ఏదీ అనర్హం కాదు. ఈ మాటనే నమ్ముకున్న కొంతమంది కాల్ సెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. పర్సనల్ లోన్ల పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ముఠా గుట్టును బైట పెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.
చెన్నైకి చెందిన కొందరు పంజగుట్ట, బంజారాహిల్స్‌లో ఎలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి 60 మందిని టెలీకాలర్లుగా నియమించుకున్నారు. కొన్ని కాల్‌సెంటర్లకు చెందిన ఉద్యోగుల నుంచి పలువురి ఫోన్ నంబర్లు సేకరించి..వారికి ఫోన్లు చేస్తుంటారు. మహేంద్ర ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని రూ.10 లక్షల వరకు 6.5 శాతం ఏడాది వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తామంటూ నమ్మిస్తారు. ఈ వలలో పడినవారికి తమ వాట్సాప్ నంబర్ ఇచ్చి పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని వారికి ఫోన్ చేసిన లోన్ ఇచ్చేందుకు రెండు వాయిదాలు ముందే చెల్లించాలని చెప్పి..డెబిట్‌కార్డు..వివరాలు..ఓటీపీ తెలుసుకుని సదరు ఖాతాదారుడి అకౌంట్ నుంచి సొమ్మును దోచేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 10 వేల మందికి ఫోన్లు చేయగా..వీరి వలలలో 600 మంది పడ్డారు.వారి నుంచి రూ.25 కోట్లు స్వాహా చేశారు. సంవత్సరం కాలంగా కొనసాగుతున్న ఈ కాల్ సెంటర్ దోపిడీని ఓ బాధితుడి ద్వారా సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్, ఎస్సైలు జి.తిమ్మప్ప, పి.సురేశ్‌ల టీమ్ లు కాల్ సెంటర్లపై దాడులు చేసి 62 మందిని అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించారు. రూ.80 వేల నగదు, ల్యాప్‌టాప్‌లు, రూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.6 లక్షలు ఫ్రీజ్ చేశాయి. అదుపులోకి తీసుకున్న వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి మిగిలిన వారికి నోటీసులు ఇచ్చారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ఈ కాల్ సెంటర్ దందా మోసాలను సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌లు మార్చి 25న ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు.